జిల్లా కేంద్రంలోని లైబ్రరీకి నిరుద్యోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ గదిలో అవసరం మేరకు టేబుల్‌, కుర్చీలు లేవు. ఒకటే టేబుల్‌, కొన్ని మాత్రమే కుర్చీలు ఉన్నాయి. సౌకర్యాలు కల్పిస్తే మరో 10 నుంచి 15 మంది చదువుకునేందుకు వీలుంటుందని నిరుద్యోగులు చెబుతున్నా రు. స | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలోని లైబ్రరీకి నిరుద్యోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ గదిలో అవసరం మేరకు టేబుల్‌, కుర్చీలు లేవు. ఒకటే టేబుల్‌, కొన్ని మాత్రమే కుర్చీలు ఉన్నాయి. సౌకర్యాలు కల్పిస్తే మరో 10 నుంచి 15 మంది చదువుకునేందుకు వీలుంటుందని నిరుద్యోగులు చెబుతున్నా రు. స

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

జిల్లాలోని లైబ్రరీలకు పక్కా భవనాలు కరువు 48 మంది సిబ్బందికి ఉన్నది ఆరుగురే.. పలుచోట్ల పాత పుస్తకాలే దిక్కు.. జిల్లా కేంద్రంలో సరిపోని గదులు పోటీ పరీక్షల సన్నద్ధత కోసం నగరాలకు యువత కొత్త పుస్తకాలు తెప్పించి, సౌకర్యాలు కల్పించాలని విన్నపం

శిథిల భవనంలో నిర్వహణ

వాంకిడి: మండల కేంద్రంలో గ్రంథాలయానికి పక్కా భవనం లేకపోవడంతో ప్రమాదకరంగా మారిన పాత ఎంపీడీవో భవనాన్ని కేటాయించారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో భవనం పూర్తిగా ఉరుస్తోంది. దీంతో సమావేశాల నిర్వహణ కోసం వినియోగించే హాల్‌లోనే నిరుద్యోగులు చదువుకుంటున్నారు. అక్కడ సైతం వర్షపు నీరు ఉరుస్తుండటంతో బకెట్లు పెట్టి సర్దుకుంటున్నారు. టాయిలెట్లు వాడుకోలేని విధంగా మారాయి.

సమస్యల గ్రంథం!

ఆసిఫాబాద్‌రూరల్‌: సాధారణ పాఠకులు, నిరుద్యోగులకు విజ్ఞానం అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన సౌకర్యాలు, అవసరం మేరకు పుస్తకాలు, పక్కా భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల పోలీసు కొలువుల భర్తీకి ప్రకటన విడుదల కావడంతో చాలామంది యువత లైబ్రరీల బాట పడుతున్నారు. కానీ జిల్లాలో కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే లైబ్రరీకి సొంత భవనం ఉంది. మిగతా అన్ని మండలాల్లో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. 15 మండలాల్లో తొమ్మిది గ్రంథాలయాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ మినహా మిగతా ఎనిమిది గ్రంథాలయాలకు అరకొర వసతులతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. చదువుకోవడానికి వీలుగా టేబుళ్లు, కుర్చీలు, నూతన పుస్తకాలు లేక చాలామంది నిరుద్యోగులు మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల బాట పడుతున్నారు.

జిల్లా కేంద్రంలో కిటకిట..

ఆర్థిక స్థోమత లేని నిరుపేద నిరుద్యోగులు కొంతమంది ఇంటి వద్దే సన్నద్ధమవుతుండగా.. మరికొందరు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. గతేడాది జిల్లా కేంద్రంలో రూ.1.50 కోట్లతో నూతన భవనం పూర్తి చేసి సౌకర్యాలు కల్పించారు. ఇందులో 1,628 సభ్యత్వాలు ఉండగా, 18,959 పుస్తకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్‌, కౌటాల, తిర్యాణి, బెజ్జూర్‌ తదితర మండలాల నిరుద్యోగులు జిల్లా కేంద్రంలోనే ఉంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు లైబ్రరీలో చదువుకుంటున్నారు. పోలీస్‌ నోటిఫికేషన్‌ రావడంతో లైబ్రరీకి వచ్చే వారి సంఖ్య పెరిగి ప్రస్తుతం ఉన్న నాలుగు గదులు సరిపోవడం లేదు. రెండు గదుల్లో టేబుళ్లు, కుర్చీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సౌకర్యాలు కల్పించాలని ఇటీవల అభ్యర్థులు కలెక్టరేట్‌ ఎదుట ముందు నిరసన తెలిపారు. అయినా ఇప్పటివరకు అదనంగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేధిస్తున్న ఖాళీల కొరత..

తొమ్మిది గ్రంథాలయాల్లో 48 మంది ఉద్యోగులకు ప్రస్తుతం కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 42 ఖాళీలు ఉండటంతో ఒక్కొక్కరు రెండు, మూడు లైబ్రరీల బాధ్యతలు చేపట్టారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం జిల్లా లైబ్రరీగా అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో ఇక్కడ కేటాయించాల్సిన పది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సిర్పూర్‌(టి), కౌటాల, రెబ్బెన, కాగజ్‌నగర్‌ మండలాల్లో పనిచేసే గ్రేడ్‌–3 లైబ్రరీ ఉద్యోగులు అక్కడా.. ఇక్కడా పనిచేస్తున్నారు. ఆసిఫాబాద్‌ మినహాయించి వేరే లైబ్రరీల్లో అభ్యర్థులకు అవసరమైన సమయంలో ఎవరూ ఉండటం లేదు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను సొంతంగా కొనుక్కొని వెంట తెచ్చుకుంటున్నారు. స్వీపర్లు నిరక్షరాస్యులు కావడంతో ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న గ్రంథాలయాన్ని అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. సుమారు 1,800 కథలు, నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, డిక్షనరీలు, రెఫరెన్స్‌ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. రెండు గదులు ఉన్నా రీడింగ్‌ గదిలో పాత సామాన్లు, విరిగిపోయిన బెంచీలు, కుర్చీలు ఉంచుతున్నారు. వాటి పక్కనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి. ఇక్కడ విధులు నిర్వహించే లైబ్రేరియన్‌కు జిల్లా కేంద్రంలో డ్యూటీ వేస్తుండటంతో ఇక్కడికి వారంలో రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. నెలకు కొంత డబ్బులు ఇచ్చి ఒక అటెండర్‌ను ఉంచగా, అతను గ్రంథాలయం తాళం తెరిచి కూర్చుంటున్నాడు. లైబ్రేరియన్‌ లేకపోవడంతో పుస్తకాల గదికి ఎప్పుడూ తాళం వేసే ఉంటుందని పాఠకులు చెబుతున్నారు. ఫలితంగా లైబ్రరీకి ఎవరూ రావడం లేదు. పత్రికల కోసం పాఠకులు కొంతమంది వస్తున్నారు. అయినా కొన్నిపేర్లు విజిటర్స్‌ బుక్‌లో రాసి పెడుతుంటారు. రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయంలో పాత పుస్తకాలే ఉన్నాయి. కొత్తగా అప్‌డేట్‌ చేసిన కరెంట్‌ అఫైర్స్‌, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, మ్యాగజైన్లు లేవు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు.

పాఠకులు రాకపోయినా.. విజిటర్స్‌ బుక్‌లో పేర్లు

గ్రంథాలయాల్లో ఖాళీలు ఇలా..

పోస్టు మంజూరు పనిచేస్తున్న ఖాళీలు

వారు

లైబ్రేరియన్‌ గ్రేడ్‌– 2 2 0 2

లైబ్రేరియన్‌ గ్రేడ్‌– 3 9 5 4

రికార్డ్‌ అసిస్టెంట్‌ 9 1 8

కార్యాలయ సిబ్బంది 9 0 9

వాచ్‌మెన్‌ 9 0 9

పట్టించుకోవడం లేదు

కాగజ్‌నగర్‌ పట్టణంలోని గ్రంథాలయాన్ని పట్టించుకోవడం లేదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు లేకపోవడంతో వారు రావడం లేదు. అధికారులు స్పందించి పోటీ పరీక్షలకు అవసరమయ్యే నూతన పుస్తకాలు, కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. – పొన్న రమేశ్‌, కాగజ్‌నగర్‌

సౌకర్యాలు కల్పించేందుకు కృషి

జిల్లా కేంద్రంలో నిర్మించిన గ్రంథాలయంలో అదనపు గదుల నిర్మాణం, మిగతా అన్ని మండలాల్లో సొంత భవనాల ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నాం. కాగజ్‌నగర్‌లో రూ.50 లక్షలతో లైబ్రరీ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం.

– అనిల్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌

కొత్త పుస్తకాలు రాలేదు

కాగజ్‌నగర్‌ గ్రంథాలయంలో సుమారు 1,800 పుస్తకాలు, నవలలు, చిన్న పిల్లల కథల పుస్తకాలు తదితర పాత పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కొత్త పుస్తకాలు రాలేదు. జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో కూడా విధులు నిర్వహించాల్సి రావడంతో ఇక్కడ వారంలో రెండు రోజులు మాత్రమే ఉంటున్నాను. పాఠకులకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.

– కె.ప్రవీణ, లైబ్రేరియన్‌, కాగజ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement