కొనసా..గుతున్న సర్వే! | - | Sakshi
Sakshi News home page

కొనసా..గుతున్న సర్వే!

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

● ప్రైవేటు వలంటీర్లతో వివరాల సేకరణ ● జిల్లాలో 30 శాతమే పూర్తి.. ● రాష్ట్రస్థాయిలో 25వ స్థానం

జిల్లాలో సర్వే తీరు

దహెగాం: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంటల వివరాలను డిజిట ల్‌ పద్ధతిలో సేకరిస్తూ పక్కాగా నమోదు చేస్తున్నారు. అయితే జిల్లాలో 2026– 27 వానాకా లం సీజన్‌లో క్రాప్‌ సర్వే నెమ్మదిగా సాగుతోంది. ప్రైవేట్‌ వలంటీర్లు రైతుల పొలాల వద్దకు వెళ్లి ఏఏ పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశా రు అనే వివరాలతోపాటు రైతు ఫొటో తీసుకుని అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 25వ స్థానంలో ఉంది. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 4,52,317 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రధానంగా పత్తి 3.77 లక్షల ఎకరాలు, వరి 35,452 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి పూత, కాత దశలో ఉండగా, ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఎల్‌నినో ప్రభావం గురించి అధికారులు ప్రచారం చేయడంతో వరి సాగు తగ్గింది. సోయా, పెసర, మొక్కజొన్న, మినుముల వంటి ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.

పది రోజులే గడువు..

జిల్లాలోని 414 రెవెన్యూ గ్రామాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం 368 మంది వలంటీర్లను కేటాయించగా, 285 మంది మాత్రమే సర్వేలో పాల్గొంటున్నారు. ఇంకా 129 మంది రిజిస్టర్‌ చేసుకోలేదు. 2,15,529 వ్యవసాయ క్షేత్రాలను కేటాయించగా ఈ నెల 17 వరకు 64,748 వ్యవసాయ క్షేత్రాలను సర్వే చేశారు. ఇంకా 1,51,781 వ్యవసాయ క్షేత్రాల వివరాలు సేకరించాల్సి ఉంది. సర్వే 30 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే ఈ నెల 1 నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 30 వరకు గడువు విధించారు. ఇప్పటికే 20 రోజులు గడిచిపోగా ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పంటల వివరాల నమోదు పూర్తయితే జిల్లాలో సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితిపై మరింత స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రానుంది.

సర్వే ఉద్దేశం..

డీసీఎస్‌తో ద్వారా రైతులకు మేలు కలుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతుభరోసా, పంటరుణాలు, బీమా పొందే అవకాశాలు ఉంటాయి. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఏయే పంట నష్టపోయారనేది సులభంగా తెలుసుకోవచ్చు. దిగుబడులు అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం నుంచి అందించే సబ్సిడీలు సరైన సమయానికి అందుతాయి. ప్రధానంగా దళారీ వ్యవస్థను నిర్మూలించవచ్చు.

రైతులు సహకరించాలి

డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు వ లంటీర్లను నియమించాం. క్షేత్రస్థాయికి సిబ్బంది వచ్చినప్పుడు ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రైతులు వివరించి సహకరించాలి. జిల్లాలో ఇప్పటివరకు సర్వే 30 శాతం పూర్తయింది. వేగవంతం చేయాలని మండల వ్యవసాయాధికారులను ఆదేశించాం. గడువులోగా వంద శాతం పూర్తి చేస్తాం.

– వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

రెవెన్యూ గ్రామాలు 414

సర్వేకు కేటాయించిన వ్యవసాయ క్షేత్రాలు 2,16,529

పూర్తయినవి 64,748

పెండింగ్‌ 1,51,781

నియమించిన వలంటీర్లు

368 మంది

పాల్గొంటున్న వారు 285 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement