ఇళ్ల స్థలాల రెగ్యులరైజ్‌కు సై.. | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల రెగ్యులరైజ్‌కు సై..

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

● పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం ● ఫలించనున్న దశాబ్దాల నిరీక్షణ ● వైఎస్సార్‌ తెచ్చిన జీవో అమలు

కోల్‌బెల్ట్‌ ప్రాంతవాసుల్లో హర్షం

బెల్లంపల్లి: కోల్‌బెల్ట్‌ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. బొగ్గు గని కార్మికులు, కార్మికేతరుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జీవో 76 ప్రకారం 45రోజుల్లో ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియతో కోల్‌బెల్ట్‌ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో దాదాపు ఏడువేల ఇళ్ల దరఖాస్తులు ఈపాటికే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది ఇళ్లు కట్టుకుని పట్టాల కోసం నిరీక్షిస్తున్నారు. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ ఏరియాల్లో డీడీలు కట్టి ఏళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి కంపెనీకి చెందిన లీజు భూముల్లో దశాబ్దాల క్రితం ఇళ్లు కట్టుకుని నివాసముంటున్న కార్మికులు, పేదలు, రిటైర్డ్‌ కార్మికులకు ప్రయోజనం కలగనుంది. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాల పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం కలగనుండగా ఇటీవలి కాలంలో స్థిర నివాసాలు కట్టుకున్న ఇళ్లకూ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ వస్తోంది.

వైఎస్సార్‌ తెచ్చిన జీవో ఆధారంగానే..

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల పట్టాల జారీకి ప్రత్యేకంగా జీవో 76 జారీ అయింది. దాని ఆధారంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అయితే, రాష్ట్రాన్ని పదేళ్లు ఏలిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధపడినప్పటీకీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి కొద్దిరోజుల ముందుగా ఇళ్ల పట్టాలు కొందరికి అందజేసినా ఇంకా అనేక మందికి పంపిణీ జరగలేదు. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడం ఇతర ప్రతికూల పరిస్థితులు తోడు కావడంతో ఇళ్ల పట్టాల పంపిణీ అసంపూర్తిగా ఉండిపోయింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా వైఎస్సార్‌ తెచ్చిన జీవో 76ను అనుసరించి ఇళ్ల క్రమబద్ధీకరణ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే, కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని భూముల స్వభావం, ప్రభుత్వ, సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, హైకోర్టు ఆదేశాలు తదితర అంశాలను పరిగణనలోని తీసుకోనున్నారు.

తుది నిర్ణయం త్రిసభ్య కమిటీదే..

ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇందులో కలెక్టర్‌ చైర్మన్‌గా, సింగరేణి కాలరీస్‌ కంపెనీ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇళ్ల పట్టాల జారీకి విధి విధానాలను అనుసరించి ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.

45 రోజుల డెడ్‌లైన్‌ విధింపు

సింగరేణి విస్తరించి ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల దరఖాస్తులు, కొత్తగా నిర్మించిన ఇళ్లకు ఏర్పడిన పట్టాల అవరోధాలకు పరిష్కారం చూపనున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయడానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. 45రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామని ప్రకటించింది. మంచిర్యాల జిల్లా పరిధిలో శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల ప్రజల ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం కానుంది. పట్టా జారీ చేసిన వెంటనే 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

కార్మికులు, కార్మికేతరులకూ..

సింగరేణి కార్మికులే కాకుండా కంపెనీ ఖాళీ స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని దశాబ్దాల నుంచి నివాసముంటున్న కార్మికేతరులకు ఇళ్ల పట్టాలు దక్కనున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు, రిటైర్డ్‌ కార్మికులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు ఇళ్లపట్టాలు లేక కార్మికులు, కార్మికేతరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిపై యాజమాన్యపు హక్కు లేక బ్యాంక్‌ రుణాలు పొందడానికి, ఇళ్ల మరమ్మతులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సానుకూల ప్రకటనతో ఇళ్లకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement