ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమై సిజేరియన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కాగజ్‌నగర్‌కు చెందిన గర్భిణి మల్లిశెట్టి కవిత శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ అడ్డం తిరగడంతోపాటు ఉమ్మినీరు పూర్తిగా లేనట్లు వైద్యులు పరీక్షల్లో గుర్తించారు. ఈ క్రమంలో గైనిక్, అనస్తీషియా, పీడియాట్రిక్ విభాగాల వైద్యులు అత్యవసరంగా సిజేరియన్‌తో ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ వెల్లడించారు. ఈ నెలలో ఇప్పటివరకు ఐదు సిజేరియన్ సర్జరీలు నిర్వహించగా, తాజాగా మరొకటి విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ సర్జరీలో గైనకాలజిస్టులు నందిని, దివ్య, అనస్తీషియా వైద్యులు కావ్య, ప్రవీణ్, పీడియాట్రిషియన్ ప్రియాంక పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్ సర్జరీలు చేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ సూచించారు.


