సమష్టి కృష్టితో జిల్లా అభివృద్ధి పథం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
భీం పోరాటాన్ని
వేదికపై బండ ప్రకాశ్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆసిఫాబాద్: జల్ జంగల్ జమీన్ కోసం గర్జించిన ఆదివాసీ పోరాటయోధుడు కుమురం భీం పోరా టాన్ని సగర్వంగా చాటుదామని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్ర జాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోయల్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్‌కుమార్, ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్‌తో కలిసి జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దార్శనిక పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆదర్శంగా నిలిచిందన్నారు.
పేదల వైద్యానికి రూ.21.99 కోట్లు
ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద జిల్లాలో 982 షెడ్యూల్డ్ తెగలకు చెందిన లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. 738 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. జిల్లాలో 2025– 26లో 8,396 మంది పేదలకు వైద్య చికిత్స అందించి, ఇప్పటివరకు రూ.21.99 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. మహాలక్ష్మి పథకం కింద 78,467 కుటుంబాలకు గృహ అవసరాల కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కేవలం రూ.500కే అందజేస్తున్నామన్నారు.
రైతుల ఖాతాల్లోకి రూ.250.30 కోట్లు
రైతు భరోసా పథకం కింద 2025– 26 వానాకాలంలో 1,33,860 మంది రైతుల ఖాతాల్లో రూ.250.30 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుబీమా పథకంలో 74,567 మంది రైతులను నమోదు చేసి, 470 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.23.50 కోట్లు అందించామని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ప్రాథమిక పాఠశాలలు మొదలుకుని విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందన
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వ్య క్తిగత పరిశుభ్రత ముఖ్యమని, పారిశుద్ధ్యంలో భాగస్వాములైన సిబ్బంది, ప్రజలను అభినందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యలతో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి అహర్నిశలు కృషి చేసి వరద విపత్తులో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రజలను రక్షించుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్న ప్రజాప్రతి నిధులు, అధికారులకు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆడబిడ్డల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత
8,798 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు జిల్లాలో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వివరించారు. జిల్లాకు 8,798 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 4,734 మంది గిరిజనులకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఇప్పటికే 875 ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలోని 1,65,258 రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆడపడచులు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించడంతో జిల్లాలో ఇప్పటివరకు 2.41 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు రూ.88.05 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో జిల్లాలో 84,684 కుటుంబాలకు రూ.55.53 కోట్ల రాయితీ కల్పించినట్లు వివరించారు.


