ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా మైదానంలో గురువారం జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్– 2026 పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, డీవైఎస్‌వో అశ్వక్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్‌లతో పాటు 400, 600, 800 మీటర్ల రన్నింగ్ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. ఉత్తమ ప్రతిభ చూపిన 45 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు డీవైఎస్‌వో షేకు, అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని వెల్లడించారు. అక్కడ రాణించిన వారికి అసోసియేషన్ తరఫున షూ, ట్రాక్‌సూట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
క్రీడలతో పోటీతత్వం
డీవైఎస్‌వో షేకు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, మానసిక ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఫిట్‌గా ఉంటారని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్, నోడల్ ఆఫీసర్ మీనారెడ్డి, మధుసూదన్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, తిరుమల్, రాకేష్, పీడీలు, పీఈటీలు తిరుపతి, వెంకటేష్, లక్ష్మణ్, సుభాష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


