మట్కా మాఫియా..! | - | Sakshi
Sakshi News home page

మట్కా మాఫియా..!

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న నిషేధిత జూదం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహణ రూ.లక్షల్లో లావాదేవీలు అత్యాశతో కుదేలవుతున్న కుటుంబాలు

బెజ్జూర్‌ మండలం గోల్కొండ కాలనీలో ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్న మెరుగు అంజన్నను ఈ నెల 18న బెజ్జూర్‌ ఎస్సై సర్తాజ్‌పాషా అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్టా గ్రాం, ఫేస్‌బుక్‌ ఐడీల ద్వారా మట్కా నంబర్లను ప్రచారం చేసి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఖాతాలోని రూ.4 వేల నగదును సీజ్‌ చేసి రెండు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు, రూ.2 వేల నగదు స్వాధీనం చేశారు.

కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ గ్రామంలో ఈ నెల 19న మట్కా నిర్వహిస్తున్న షేక్‌ సిరాజ్‌ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఫోన్లు, ఒక ప్రింటర్‌, ప్రింటింగ్‌ పేపర్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మట్కాకు సబంధించిన పత్రాలను సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

కౌటాల: నిషేధిత క్రీడ మట్కా జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో పేద, మధ్య తరగతి ప్రజలు ఈ మహమ్మారికి బలైపోతున్నారు. కూలీలు, కార్మికులు సైతం ఈ జూదంలో తమ కష్టార్జితాన్ని పెడుతూ నష్టాలపాలవుతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ వేదికను నిర్వాహకులు అడ్డాగా మార్చుకుంటున్నారు. కాగజ్‌నగర్‌ ప్రాంతం బెట్టింగ్‌, సట్టా, మట్కా, దొంగ నంబర్‌ దందాలకు అడ్డాగా మారిందని ఏకంగా సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం గమనార్హం. మట్కా వలలో పడి యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్‌ వేదికగా..

మహారాష్ట్ర కేంద్రంగా రాజధాని, కళ్యాణ్‌, మెయిన్‌ ముంబయి, శ్రీదేవి, టైం, మిలన్‌ తదితర సంస్థల పేరిట మట్కా జూదం సాగుతోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా రోజుకు నాలుగుసార్లు ఒక్కో నంబర్‌ చొప్పున విడుదల చేస్తారు. మహారాష్ట్ర కేంద్రంగా అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఆట రాష్ట్రంలో నిషేధం ఉంది. అయితే ముంబయి, బల్లార్షా, వని తదితర ప్రాంతాలకు చెందిన నిర్వాహకులు జిల్లాలోని ఏజెంట్లకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్‌ ఇస్తూ ఆట నిర్వహిస్తున్నట్లు సమాచారం. పండ్ల వ్యాపారులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, సామాన్యులే వారికి లక్ష్యంగా మారుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్‌లో వచ్చే నంబర్లను ఏజెంట్లకు చేరవేస్తారు. వారు ఆన్‌లైన్‌, చీటీల రూపంలో డబ్బులు సేకరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా ఆన్‌లైన్‌ వేదికగానే మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్‌లో ఆటగాడు చెప్పిన నంబర్‌ను రాసుకుని డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. లావాదేవీలన్నీ యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుగుతుంటాయి.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం

మట్కా ఆట నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నిందితులపై కేసు నమోదు చేయడంతోపాటు బైండోవర్‌ చేస్తున్నాం. గతంతో పోలిస్తే మట్కా కేసులు తగ్గాయి. యువత అత్యాశ్యతో ఆర్థికంగా నష్టపోవద్దు. మట్కా నిర్వహించే వారి వివరాల ను పోలీసులకు తెలియజేసి సహకరించాలి.

– ప్రేమ్‌కుమార్‌, సీఐ, కాగజ్‌నగర్‌

ఇటీవలి ఘటనలు

అత్యాశతో అప్పులపాలు

మట్కాలో సింగిల్‌ నంబర్లను ఓపెన్‌, క్లోజ్‌లుగా వ్యవహరిస్తారు. రెండు నంబర్లను కలిపి బ్రాకెట్‌గా పిలుస్తారు. మూడు నంబర్లను పనా అని పిలుస్తారు. ఇందులో ఓపెన్‌, క్లోజ్‌లకు పది రూపాయలకు వంద, బ్రాకెట్‌కు పది రూపాయలకు వెయ్యి, పనాకు పది రూపాయలకు పది వేలు ఇస్తుంటారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో లావాదేవీలు సాగుతున్నట్లు సమాచారం. ఎంతవరకు పెడితే పదింతలు డబ్బు వస్తుందని సామాన్యులు ఆసక్తి చూపుతారు. దీంతో అత్యాశతో చాలామంది ఈ జూదంతో ఉన్నదంతా పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. రోజువారీ కూలీలు తమ రోజువారీ సంపాదనలో రూ.50 నుంచి రూ.100 వరకు ఈ ఆటకే వెచ్చిస్తున్నారు. ఏటా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement