‘ఉపాధి’కి కుట్టు మిషన్లు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి కుట్టు మిషన్లు

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

● బీసీ మహిళలకు వందశాతం సబ్సిడీతో అందజేత ● జిల్లాలో ఇప్పటివరకు 2,171 దరఖాస్తులు

కాగజ్‌నగర్‌టౌన్‌: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్‌లో శిక్షణ పొందిన వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకం పేరుతో ఉచితంగా ఆటోమెటిక్‌ కుట్టుమిషన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,171 దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో నియోజకవర్గానికి 1000 మిషన్లు పంపిణీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లో రెండు వేల మిషన్లు అందించనున్నారు.

వందశాతం సబ్సిడీతో..

మహిళలకు టైలరింగ్‌ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. రూ.21వేల విలువైన యంత్రాలను వందశాతం సబ్సిడీతో పంపిణీ చేయనుంది. ఇందుకు సెప్టెంబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ సామాజిక వర్గానికి చెందిన 18– 55 ఏళ్ల మహిళలు అర్హులు.. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలి. ఒక రేషన్‌ కార్డుపై ఒక్కరు మాత్రమే అర్హులు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, నిరుద్యోగ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. అర్హులైన బీసీ మహిళలు https://tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన నిరుద్యోగ మహిళలకు పథకం వర్తింపజేసేలా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023–24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధి పొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే కనీసం ఐదో తరగతి పాసైన వారికి అవకాశం కల్పించనున్నారు.

నిబంధనల మేరకు పంపిణీ

అర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు సెప్టెంబర్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు జిల్లాలో 2,171 దరఖాస్తులు వచ్చాయి.

– నదీమ్‌, జిల్లా బీసీ సంక్షేమ అధికారి

ధ్రువపత్రాల కోసం తంటాలు

బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఇందిరమ్మ కుట్టుమిషన్‌ పథకానికి దరఖాస్తు కోసం ఆదాయ, కుల సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నా సర్టిఫికెట్లు త్వరగా రావడంలేదని వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసినా తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు వేగంగా పరిశీలించకపోవడంతో జారీలో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement