ఆసిఫాబాద్: ఎస్‌ఐఆర్– 2026లో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. గత వారం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలోని వివరాలను సంబంధిత అధికారులకు ఓటర్లకు చదివి వినిపించనున్నారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, మృతి చెందిన, ఇప్పటికే వేరేచోట నమోదైన వారి వివరాలను కూడా గ్రామ సభ ముందుంచనున్నారు. అభ్యంతరాలపై ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 4,07,457 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 2,04,705 మంది పురుషులు, 2,02,726 మంది మహిళలు, ఇతరులు 26 మంది ఉన్నారు.
నోటీసుల జారీకి చర్యలు
జిల్లాలో మొత్తం 4,07,457 ఎన్యూమరేషన్ ఫారాలు జారీ చేయగా, 84,990 మంది ఓటర్లు అనామలీస్ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరణించినవారు 11,334 మంది ఉండగా, వలస వెళ్లినవారు 23,766 మంది, ఇప్పటికే నమోదైనవారు 10,463, ఆబ్సెంట్ 2,188, ఇతర కారణాల కేటగిరీలో 388 మంది ఉన్నారు. ఇంటి నంబర్, వీధి పేరు చిరునామా స్పష్టంగా లేని వారు, డూప్లికేట్ ఎంట్రీలు, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం, చనిపోయిన వారిని డెత్ సర్టిఫికేట్ ద్వారా తొలగించా ల్సిన వారు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, ఫొటో ఆధార్ లింక్ లేని వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించనున్నారు. 2002 ఓటరు జాబితాను అనుసరించి మ్యాపింగ్ చేసుకోకపోవడం, ఓటరు, తండ్రి పేరు, వయస్సు తప్పులు ఉన్న వారికి జిల్లా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయనుంది. ఇందుకోసం బీఎల్‌వోలు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామ సభలు ఇలా..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ, వార్డు సభల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు, వార్డు అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను చదివి వినిపించనున్నారు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తిస్తారు. అర్హులు ఓటుహక్కు కోల్పోకుండా, జాబితా నుంచి తొలగించకుండా అభ్యంతరాలు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఓటర్లు ప్రభుత్వం సూచించిన 12 రకాల ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటారు. ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై అవగాహన కల్పిస్తారు.


