ఆసిఫాబాద్‌అర్బన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో 60మంది భక్తులు అర్ధమండల దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 5గంటల నుంచి అర్చకులు ఒజ్జల శిరీశ్‌శర్మ, శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, నవగ్రహపూజ, ఆంజనేయస్వామికి రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామపూజ, అనంతరం దీక్షాపరులకు మాలధారణ కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం కాషాయమయమైంది. జైశ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. అనంతరం మంగళహారతి, మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. దీక్షా కాలంలో పాటించాల్సిన నియమాలను భక్తులకు సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు గుండా వెంకన్న, ధర్మపురి వెంకటేశ్వర్లు, పిన్నా వివేక్, ఎకిరాల శ్రీనివాస్, రావుల నారాయణమూర్తి, వనం మధు, లక్ష్మణమూర్తి, సుధాకర్, గణపతి తదితరులు పాల్గొన్నారు.


