ఆసిఫాబాద్‌అర్బన్: డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.విశ్వప్రసాద్‌రావుపై ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ఆరోపణలు నిరాధారమని ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, భారతి, స్వప్నరాణి, కృష్ణమ్మ, పుష్పలత, తారాబాయి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే విశ్వప్రసాద్‌రావు ఎన్నికల సామగ్రి, ప్రచార రథాలు, తదితర ఏర్పాట్లు చేసి కార్యకర్తలను సన్నద్ధ చేయడంతో కీలకంగా పనిచేశారని తెలిపారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లేశ్‌కు 2, 6, 19 వార్డుల ఎన్నికల బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 19వ వార్డులో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి లేకపోవడంపై వాస్తవాలను పరిశీలించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేశారంటూ చేసిన ఆరోపణలపై ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.


