వేతన కమిటీ వేయరా? | - | Sakshi
Sakshi News home page

వేతన కమిటీ వేయరా?

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

12వ వేజ్‌బోర్డు మొదలై నెలన్నర ఈసారి ఎప్పుడూ లేని అనిశ్చితి గుదిబండగా కొత్త లేబర్‌కోడ్‌లు అమలైతే జీతాల పెంపు ప్రశ్నార్థకం పోరుకు జాతీయ సంఘాలు సిద్ధం

శ్రీరాంపూర్‌: దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల్లో కార్మికుల వేతనాల పెంపు ఈసారి ప్రహసనంగానే మారింది. జూలై 1, 2026 నుంచి 12వ వేతన ఒప్పంద కాలపరిమితి మొదలైంది. కానీ, ఇప్పటికీ కోలిండియా యాజమాన్యం వేతన ఒప్పంద కమిటీని నియమించలేదు. 11వ వేజ్‌బోర్డులో ఆర్నెళ్ల ముందే కమిటీ వేశారు. ఈసారి కాలపరిమితి మొదలై నెలన్నర గడిచినా కమిటీపై స్పష్టత లేదు. ఇన్నేళ్ల వేజ్‌బోర్డుల్లో ఏనాడు లేని అనిశ్చితి ప్రస్తుతం నెలకొంది. కేంద్రం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లే నేడు వేతన కమిటీ ఏర్పాటు, అనంతరం వేతన ఒప్పందానికి గుదిబండగా మారాయి. కోలిండియాలో 2.05 లక్షల మంది, సింగరేణిలో 40వేల మంది.. మొత్తంగా 2.45లక్షల మంది కార్మికులు బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఐదేళ్లకోసారి వేతనాల పెంపు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ముందుగా వేతన కమిటీ వేసి అనంతరం చర్చలు చేస్తూ వేతన ఒప్పందం చేసుకుంటారు. ఈసారి కమిటీ ఏర్పాటుపైనే తీవ్ర గందరగోళం నెలకొంది.

ఎన్నికలు నిర్వహించాల్సిందేనా?

ఈ వేతన ఒప్పందం నుంచే నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేయడానికి ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యం సిద్ధమైంది. ఇందులో భాగంగా జూన్‌ 5న రాంచీలో నిర్వహించిన జేసీసీఐ సమావేశంలోనే జాతీయ సంఘాలన్నీ 12వ వేతన కమిటీ వేయాలని కోరగా.. ముందుగా లేబర్‌కోడ్‌లు అమలు చేస్తామని, ఇందులో భాగమైన పారిశ్రామిక సంబంధాల కోడ్‌–2020ని అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐదు జాతీయ సంఘాలకు ఎన్నికలు నిర్వహించి అందులో 51శాతం ఓట్లు వస్తే వారిని గుర్తింపు సంఘంగా గుర్తిసారు. వారితో మాత్రమే చర్చలు జరుపుతారు. ఇక 20శాతం ఓట్లు వస్తే వారిని ప్రాతినిధ్య సంఘంగా గుర్తిసారు. ఈ ఓట్ల శాతాన్ని బట్టే సభ్యులను నెగోషబుల్‌ కౌన్సిల్‌లోకి తీసుకుంటామని వారితోనే వేతన ఒప్పందం జరుగుతుందని యాజమాన్యం తేల్చిచెప్పింది.

జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు

12వ వేతన కమిటీ ఏర్పాటు కోసం పోరాడటానికి బీఎంఎస్‌ మినహా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూలు కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటాలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 1, 2026న దేశ వ్యాప్తంగా నిరసనలు, ఈ నెల 10న అన్ని జీఎం కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాయి. సెప్టెంబర్‌ 12న జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో సదస్సు ఏర్పాటు చేసి నేతలు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. లేబర్‌కోడ్‌లు అమలు కాకుండా చేస్తేనే కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరుగుతుందని, లేకుంటే ఈసారి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళన కార్మికుల్లో నెలకొంది.

కేంద్రం దిగివచ్చేలా పోరాడుతాం

లేబర్‌కోడ్‌లు అమలు కా కుండా అడ్డుకుంటాం. రాంచీలో నిర్వహించే సదస్సులో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. రైతులు, విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. బొగ్గు గనులు, అవసరమైతే నిరవధిక సమ్మె చేసి పారిశ్రామిక రంగాన్ని స్తంభింపజేస్తాం. కేంద్రం దిగి వచ్చేలా పోరాడుతాం.

– మంద నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు

ఎలక్షన్‌ జరిగితే పట్టుకోల్పోవడమే..

ఎన్నికలు జరిగితే కార్మిక సంఘాలు పట్టుకోల్పోనుండగా వేతనాల పెంపు పూర్తిగా యాజమాన్యం చేతిలోకి వెళ్తుందని, తద్వారా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని జాతీయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా అందులో 51శాతం ఓట్లు ఎవరికీ రావని వారు భావిస్తున్నారు. చివరికి 20 శాతం ఓట్లు వస్తే అందులోనూ 20శాతం వచ్చిన సంఘం నుంచి ఒక ప్రతినిధిని, 40 శాతం వస్తే ఇద్దరు ప్రతినిధులనే కౌన్సిల్‌లోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు వేతన ఒప్పందలో జాతీయ సంఘాలన్నింటికీ కలిపి 18మంది సభ్యులున్నారని, తామెంతో కొట్లాడితే గానీ వేతనాలు పెరగడం లేదని, ఈ ఎన్నికలు జరిగితే ఒకరిద్దరే కౌన్సిల్‌లో ఉంటారని, అప్పుడు పోరాడే శక్తి తగ్గి కార్మికవర్గానికి నష్టం జరుగుతుందని నేతలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement