ఆసిఫాబాద్: జిల్లా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమంది రైతులు వరినాట్లు వేస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బోరుబావులు ఉన్న రైతులు సైతం వరి సాగుకు అవసరమైన నీరు అందుబాటులో ఉందా అనే విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే వర్షపాతం మెరుగ్గా ఉన్నప్పటికీ వరి సాగుకు సరిపడా నీటి లభ్యత ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆరుతడి పంటల సాగుతో రైతులు అధిక దిగుబడులతోపాటు లాభాలు పొందాలని ఆకాంక్షించారు.
15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
జిల్లాలో ఈ నెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల, గ్రామస్థాయిలో ప్రణాళికాబద్ధంగా కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని, అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.


