దంచికొట్టిన వర్షం | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వర్షం

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

జిల్లావ్యాప్తంగా రెండోరోజూ వాన జోరు ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద.. మత్తడి దూకిన చెరువులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌/సాక్షి నెట్‌వర్క్‌: జిల్లాలో రెండోజూ గురువారం వర్షం దంచికొట్టింది. వర్షానికి జనజీవనం స్తంభించిపోగా, వ్యాపార లావాదేవీలు లేక మార్కెట్లు వెలవెలబోయాయి. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ప్రాణహిత, పెన్‌గంగ నదుల్లో ఉధృతి పెరిగింది. వందల ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. అత్యధికంగా బెజ్జూర్‌లో 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సిర్పూర్‌(యు)లో 3.2 మి.మీ.ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 121.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు కలెక్టర్‌ కె.హరిత గురువారం సెలవు ప్రకటించారు. వర్షానికి జిల్లా కేంద్రంలోని రహదారులు జలమయ్యాయి. పెద్దవాగు రెండువైపులా ఒడ్డు వరకు ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం(అడ) ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. అలాగే వట్టివాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్‌ వాగు లు ఉప్పొంగాయి.

అధికారుల పర్యవేక్షణ

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ హరిత ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి వాగు, తుంపెల్లి వాగు, అడ ప్రాజెక్టును పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎస్పీ నితిక పంత్‌ పోలీసు అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలు, లోలెవల్‌ వంతెనలను పరిశీలించారు. అడ ప్రాజెక్టులో నీటిమట్టం, గేట్ల నిర్వహణ, వరద ప్రవాహ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికల్‌పేట్‌ మండలాల్లోని వరద ప్రాంతాలు, ప్రమాదకరమైన వంతెనలు, పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ రాజురా వాగు, అదనపు డేవిడ్‌ అడ ప్రాజెక్టుకు పరిశీలించి పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణ సహయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాలకు కంటోల్‌ రూం(85008 44365) ఏర్పాటు చేశారు.

వాగులకు వరద.. నిలిచిన రాకపోకలు

వాంకిడి మండల కేంద్రంలోని కేబీనగర్‌ కాలనీలో నివాసాలు జలమయమయ్యాయి. కెరమెరి మండలంలో లక్మాపూర్‌, అనార్‌పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 15 గ్రామాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సాంగ్వి, రాంపూర్‌, ఇంద్రానగర్‌, కెలికే కల్వర్టుల పైనుంచి వరద ప్రవహించడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. లింగాపూర్‌ మండలం ఫూల్సింగ్‌తండాకు వెళ్లేదారిలోని లోలెవల్‌ వంతెన కోతకు గురైంది. రెబ్బెన మండలంలో నంబాల వంతెన పైనుంచి వరద ప్రవహించింది. గంగాపూర్‌, లక్ష్మిపూర్‌, పులికుంట, గుండాలవాగు, కొండపల్లి, పెద్దవాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. తక్కళ్లపల్లిలో పుష్పాల నాగమ్మ ఇంటి గోడ కూలింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టుతోపాటు పెద్ద చెరువులోకి భారీగా వరద చేరింది. ఐనం, లగ్గాం సమీపంలో ఉన్న లోలెవల్‌ వంతెనల పైనుంచి వరద పారడంతో రాకపోకలు స్తంభించాయి. మొట్లగూడ, దిగిడ గ్రామాలకు చెందిన ఎనగందుల శంకర్‌, మడే అశోక్‌ల ఇళ్లు కూలిపోయాయి. సిర్పూర్‌(టి)లోని నాగమ్మ చెరువు జలకళను సంతరించుకుంది. పెంచికల్‌పేట్‌ మండలంలోని ఎల్లూర్‌ బొక్కివాగులోకి వరద చేరడంతో మత్తడి దూకింది. కొండపల్లి గొల్లవాడ మధ్య ఉన్న ఒర్రె వరద నీటిలో చిక్కున్న బొలెరో వాహనాన్ని స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. సలుగుపల్లి, అగర్‌గూడ గుండెపల్లి, కమ్మర్‌గాం, నందిగామ, మురళీగూడ, జిల్లెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు, ఉచ్చమల్ల వాగు, బొక్కివాగు పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీట మునిగాయి. చింతలమానెపల్లి మండలంలో పాల్వాయినగర్‌, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌ మార్గంలో రవాణా స్తంభించింది. రణవెల్లి, గూడెం వద్ద ప్రాణహిత నిండుగా కనిపిస్తోంది. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హేటిగూడ నుంచి కుంటలమానెపల్లి మార్గంలో రవాణా నిలిచిపోయింది. బెజ్జూర్‌ మండలంలో సుశ్మీర్‌ వాగు ఉప్పొంగి ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

లోలెవల్‌ వంతెన పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంపెల్లి వాగు

పెంచికల్‌పేట్‌: కొండపల్లి, గొల్లవాడకు వెళ్లే రహదారిపై వరదలో చిక్కుకున్న బొలెరో

దహెగాం: దిగిడ గ్రామంలో కూలిన ఇంటి గోడలు

గుండి వాగును పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

వర్షపాతం ఇలా(మి.మీ.)

బెజ్జూర్‌ 183.5

పెంచికల్‌పేట్‌ 165.4

వాంకిడి 136

కౌటాల 131.4

ఆసిఫాబాద్‌ 125

దహెగాం 121.7

కాగజ్‌నగర్‌ 121.5

సిర్పూర్‌(టి) 117.3

రెబ్బెన 114.3

చింతలమానెపల్లి 111.7

కెరమెరి 109.4

తిర్యాణి 107.3

లింగాపూర్‌ 99.6

జైనూర్‌ 94.3

సిర్పూర్‌(యు) 3.2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement