దహెగాం: రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎస్‌డీ ఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మండలంలోని లగ్గాం సమీపంలో లోలెవల్ పైనుంచి పారుతున్న వరదతోపాటు మండల కేంద్రం సమీపంలో ని పెద్ద చెరువు వరద పోస్తున్న అలుగు, దహెగాం– కాగజ్‌నగర్ ప్రధాన రహదారి వద్ద వరద నీటిని పరిశీలించారు. లోలెవల్ వంతెనలు, ప్రమాదకర వంతెనల వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. భద్రత చర్యల్లో భాగంగా దహెగాంలో 12 మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాగులు, ఒర్రెలు దాటే ప్రయత్నం చేయొద్దని, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, శిథిల ఇళ్లలో ఉండడం ప్రమాదకరమని తెలిపారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ కుమారస్వామి, తహసీల్దార్ మునావార్ షరీఫ్, ఎస్సై చుంచు రమేశ్ పాల్గొన్నారు.


