ఆసిఫాబాద్: భారీ వర్షాలపై జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వర్ష పరిస్థితులు, రక్షణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు.


