వారి రూటే.. సపరేటు! | - | Sakshi
Sakshi News home page

వారి రూటే.. సపరేటు!

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

జిల్లాలో చక్రం తిప్పుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్పీ క్యాంపులో ఒకరు.. బయట మరొకరు సస్పెన్షన్లు, ఫిర్యాదులు వచ్చినా పట్టింపు కరువు ‘ఖాకీ’వనంలో అవినీతి మొక్కలుగా ఆ ఇద్దరు..

సాక్షి ప్రతినిధి,మంచిర్యాల: కుమురంభీం ఆసిఫాబా ద్‌ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహార శైలి పోలీ సు వర్గాల్లో దుమారం రేపుతోంది. పోలీసు ఉన్నతా ధికారికి కీలకంగా వ్యవహరించే ఓ కానిస్టేబుల్‌ గత కొన్నేళ్లుగా అక్కడే తిష్ట వేసి విధుల్లో ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్లుగా మారింది. పేరుకు కానిస్టేబుల్‌గానే ఉన్నా పైఆఫీసర్లు ఎస్సై, సీఐలకు ఆదేశాలు ఇచ్చే స్థాయికి వెళ్లారు. తీవ్ర ఆరోపణలతో క్యాంపు క్లర్క్‌(సీసీ)ని కాగితాలపైనే మార్చేసి అదే హోదాతో మళ్లీ అధికారం చలాయిస్తున్నారు.

మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తన..

ఆ కానిస్టేబుల్‌ ఓ మహిళా ఎస్సైతో అసభ్య ప్రవర్తనతో 2023 ఫిబ్రవరిలో సస్పెన్షన్‌ అయ్యాడు. ఆ ఎస్సైకి వాట్సాప్‌లో వెకిలి చాటింగ్‌తో వేధింపులపై అప్పట్లో విచారణ జరిగింది. సీరియస్‌గా తీసుకున్న అప్పటి ఎస్పీ సురేశ్‌కుమార్‌ చర్యలకు ఆదేశిలిచ్చారు. అప్పటి ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక ఏం ఇచ్చారోగానీ యథాస్థానంలో మళ్లీ ఎస్పీ బదిలీ కాగానే విధుల్లో చేరిపోయారు. మహిళల విషయంలో డిపార్ట్‌మెంట్‌లో తీవ్రంగా పరిగణిస్తారు. కానీ ఈ కానిస్టేబుల్‌ ఎక్కడ సస్పెండ్‌ అయ్యారో అక్కడే డ్యూటీలో చేరడం గమనార్హం.

టాస్క్‌ఫోర్స్‌ పేరుతో దందాలెన్నో..?

గతంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో ప్రతీ దాంట్లో ఎంతో కొంత తెరవెనక వసూళ్ల పర్వం సాగేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చింతలమానెపల్లి పీఎస్‌లో నమోదైన పత్తి విత్తనాల కేసులో ఆంధ్రా వ్యాపారి, రెబ్బెనలో ఓ కేసులో రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడుల పేరుతో సెటిల్‌ అయితే ఒకే లేకపోతే కేసులు పెట్టి హింసించే వారు. అంతేకాక పొరుగు జిల్లాలోకి అడుగు పెట్టేందుకు పరిమితులున్నప్పటికీ మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో పత్తి విత్తన దందా చేస్తున్నారంటూ కొందరిపై దాడులు చేయడంతో వారంతా ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం టాస్క్‌పోర్స్‌ స్థానంలో ఎస్బీ కేంద్రంగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

రూ.200 వసూలుకు ప్రాణాలే కోల్పోయి..

సిర్పూర్‌(టి) మండలం వెంకట్రావ్‌పేట వద్ద చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు ట్రావెల్స్‌ బస్సు నుంచి రూ.200 వసూలు చేశారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే వీరిలో ఒకరిపై సస్పెన్షన్‌ ఎత్తేయగా, మరొ కరిని విధుల్లోకి తీసుకోలేదు. ఎస్పీని కలిసి తన గోడు చెప్పుకుందామని అనుమతి అడిగితే అక్కడి కానిస్టేబుల్‌ కనీస అనుమతి ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన యువ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. దహన సంస్కారాలకు సానుభూతి పరంగా జిల్లా ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పోలీసు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.

అవినీతిలో ‘మధురం’

ఇది మరో కానిస్టేబుల్‌ కథ. ఇప్పటికే ఈయన రెండుసార్లు సస్పెండయ్యారు. ఎందుకోగానీ పైఅధికారులకు ‘మధు’రంగా మారారు. జిల్లాలో జరిగే అక్రమ దందాల్లో పట్టు పెంచారు. అక్రమంగా రేషన్‌ బియ్యం, పత్తి విత్తనాలు, గడ్డి మందు రవాణా, కాగజ్‌నగర్‌లో మట్కా, సట్టా, పేకాట, నిషేధిత ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెల్లం, పటిక, దేశీదారు, జీరో సరుకుల రవాణా, ప్రైవేటు ట్రావెల్స్‌.. తదితరవన్నీ కాగజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఈ కానిస్టేబుల్‌కు పండిపోయిఉన్నారు. మహారాష్ట్ర మీదుగా వాంకిడి, కౌటాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి. అవినీతి ఆఫీసర్ల జాబితాలతో వసూల్‌ రాజాగా అప్పట్లో ఈ కానిస్టేబుల్‌ చాలా ఫేమస్‌. అయితే ఎన్ని వచ్చినా, తమను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో జిల్లా అధికారితో సహా, కిందిస్థాయి ఉన్నతాధికారులు సైతం ఆయన విషయంలో వేలు పెట్టరు. దీంతో ప్రతీ అక్రమ దందాదారు నుంచి పెద్దఎత్తున నెలనెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2025 ఆగస్టులో కోడిపందెల్లో కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే నేపంతో సస్పెన్షన్‌ అయ్యారు. అయితే వెంటనే మళ్లీ జిల్లాలో కీలకంగా పని చేసే స్పెషల్‌ బ్రాంచీలో డిప్యూటేషన్‌పై పని చేస్తుండడం గమనార్హం. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు, చేసే ఉద్యోగానికి మించి నిర్మించిన భవనం వంటి పరిశీలిస్తే రూ.కోట్లలోనే అవినీతి సంపాదన ఉన్నట్లుగా తెలుస్తోంది.

‘క్యాంపు’లో కాసుల వసూళ్లు

ప్రతీ పనికి ఎంతో కొంత వసూళ్లకు తెగబడుతున్నాడు. వీటిలో కొన్ని పరిశీలిస్తే.. ఓ కానిస్టేబుల్‌ పోక్సో కేసు నిందితుడి ఫోన్‌లో నుంచి రూ.6లక్షలు కాజేశాడు. దీనిపై సస్పెన్షన్‌ చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చాక మూడు రోజుల్లోనే రెబ్బెనలో పోస్టింగ్‌ ఇచ్చారు. కాగజ్‌నగర్‌ సబ్‌డివిజన్‌లో ఎస్సైల పలు ఆరోపణలు రాగా, వీరిలో కొందరికి మేలు చేస్తూ మరికొందరికి మాత్రం మోమోలు చార్జీషీట్లు ఇచ్చారు. ఓ కానిస్టేబుల్‌ను సోషల్‌మీడియా విభాగం నుంచి తొలగించాక మళ్లీ అక్కడే అటాచ్‌ చేసేందుకు రూ.10వేలు వసూలు చేశారు. ఇంటెలిజెన్స్‌ పరిధిలో చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ తన రిలీవింగ్‌ ఆర్డర్‌కు రూ.20వేలు సమర్పించుకున్నాడు. సిక్‌ సెటిల్‌మెంట్స్‌, మ్యూచువల్‌, పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు ఉత్తర్వులు పొందాలంటే ఆ మేరకు రూ.వేలల్లోనే ఇచ్చుకోవాల్సి వస్తోంది. క్యాంపులో తన అక్రమాలు పసిగడుతున్నారని భావిస్తే తోటి వారిని ఏదో కారణం చెప్పి వేరో చోటుకు పంపిస్తున్నారు.

క్యాంపులో ‘కలుపు’తీసేదెవరు?

ఉన్నతాధికారికి కేవలం క్లర్క్‌గానే కాక తెరవెనక జరిగే వాటిపై దృష్టి పెట్టకపోవడమే వారికి కలిసివస్తోంది. ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా ఉన్న కానిస్టేబుళ్లపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే స్థానికంగా విచారణ చేయిస్తూ కాపాడుతూ వస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ సీఐ తీరుపై పైస్థాయిలో ఫిర్యాదు వెళ్లగా ఏకంగా బదిలీ చేశారు. ఈ క్రమంలో ఈ కానిస్టేబుళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర డీజీ స్థాయిలోనే జోక్యంతోనే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement