గ్రామ పంచాయతీల్లో నిధులు పక్కదారి.. కార్యదర్శులపై ఫిర్యాదులు విచారణలో జాప్యం చేస్తున్న అధికారులు!
దహెగాం మండలం చిన్నరాస్పల్లి గ్రామ పంచాయతీలో శ్రీలక్ష్మీ ఏజెన్సీస్ నుంచి రూ.21,350 విలువ చేసే బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం సదరు ఏజెన్సీకి బిల్లు చెల్లించాలి. పంచాయతీ కార్యదర్శి అక్రమంగా ఫిబ్రవరిలో శ్రీవేద ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18,060 బిల్లు చెల్లించారు.
చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్–1 పంచాయతీలో 36 వాట్స్ బల్బులు మార్కెట్‌లో రూ.1200 లోపే లభిస్తుండగా పంచాయతీ కార్యదర్శి ఒక్కోదానికి రూ.1750 చెల్లించి కొనుగోలు చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. గురువారం పంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సదరు పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచికల్‌పేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాల నిర్వహణకు ప్రతినెలా నిధులను విడుదల చేస్తుంది. పంచాయతీలకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించాల్సిన పాలకవర్గ సభ్యులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో రూ.లక్షలాది నిధులు పక్కదారి పడుతున్నాయి. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే విద్యుత్ దీపాలు, బ్లీచింగ్ పౌడర్‌ను కొనుగోలు చేసి రికార్డుల్లో రెండింతలు చెల్లింపు చేసి జేబులు నింపుకొంటున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో రవీంద్రనగర్, బెజ్జూర్ పంచాయతీ కార్యదర్శులకు అదనపు కలెక్టర్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే పంచాయతీల్లో జరిగే పనులు, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం క్షేత్రస్థాయిలో వరంగా మారింది. ఫిర్యాదులు అంది నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని బహిరంగగానే విమర్శిస్తున్నారు.
పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు
జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. ప్రభుత్వం ఆయా పంచాయతీలకు 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు విడుదల చే సింది. ఈ నిధులను పారిశుద్ధ్య నిర్వహణ, వీధిదీ పాల ఏర్పాటు, తాగునీటికి వినియోగించాలి. రెండేళ్లుపాటు ప్రత్యేకాధికారుల పాలన పంచాయతీ కా ర్యదర్శులకు వరంగా మారింది. నూతన పాలక వ ర్గాలతో కుమ్మకై పెద్దఎత్తున నిధులను దారి మళ్లించారు. నిధుల వినియోగంలో నిబంధనలను పా టించకుండా ఇష్టారీతిన బిల్లులను తయారు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నిధుల వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఖర్చు చేసిన
నిధులు రూ.31.29 కోట్లు
(ఇప్పటివరకు)
విడుదలైన
నిధులు రూ.57.78
కోట్లు
పంచాయతీలు 335
కార్యదర్శులపై ఫిర్యాదులు
కౌటాల మండలంలోని వీర్ధండి, తాటినగర్, లింగపూర్ మండలంలోని లింగాపూర్, పిట్టగూడ, చింతలమానెపల్లి మండలంలోని రణవెల్లి, రవీంద్రనగర్– 1, బెజ్జూర్ మండలంలోని బెజ్జూర్, మర్థిడి, ఊట్సారంగపల్లి, దహెగాం మండలంలోని బీబ్రా, ఐనం, కెరమెరి మండలంలోని పరందోలి పంచాయతీల్లో నిధులను ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా కాజేశారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు బీబ్రా పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ సైతం చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పంచాయతీల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలిస్తుండటంతో పంచాయతీ కార్యదర్శులతో పాటు క్షేత్రస్థాయి అధికారుల్లో భయం పట్టుకుంది.
జిల్లా వివరాలు
విచారణ చేస్తున్నాం
గ్రామ పంచాయతీల్లో నిధులు పక్కదారి పడుతున్నాయని పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేస్తున్నాం. నిధుల వినియోగంపై పారదర్శకతను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాం. విద్యుత్ బల్బుల కొనుగోలుకు ప్రత్యేకంగా నిర్ణీత ధర నిర్ణయిస్తాం. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి


