కాగజ్‌నగర్‌టౌన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధ న కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతతోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులతో కమిటీ సభ్యుల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీకి స్వాగతం పలికిన ఉద్యమకారులు శాలువాలతో సన్మానించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ కిశోర్‌బాబు, ఐక్యవేదిక కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వర్‌రావు, నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, శంకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


