డెత్ సర్టిఫికెట్ కోసం
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామ పంచాయతీలో ఓ రైతు అనారోగ్యంతో మృతి చెందాడు. రైతుబీమా పథకంతోపాటు బ్యాంకు బీమా పథకాలు, వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి మరణ ధ్రువీకరణ పత్రం కోసం అతడి కుమారుడు స్థానిక పంచాయతీ కార్యదర్శిని కలిశాడు. రూ.2 వేలు ఇస్తేనే డెత్ సర్టిఫికెట్ ఇస్తామని సదరు కార్యదర్శి చెప్పడంతో గత్యంతరం లేక డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నాడు.
కౌటాల: జిల్లాలోని కొందరు అధికారులు డబ్బులి స్తేనే ధ్రువీకరణ పత్రాల మంజూరు చేస్తూ అవినీ తికి పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారుల వరకు కాసులిస్తేనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల సిర్పూర్ (టి) పంచాయతీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ జారీలో అప్పటి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలు అనేకం ఉన్నాయని సమాచారం. ఉన్నత చదువులు, వివాహాల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో చాలామంది పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తున్నారు. పదేళ్ల క్రితం పుట్టిన వారికి సర్టిఫి కెట్లు జారీ చేయడం, నకిలీ పత్రాలు అందించడంలోనూ మీసేవ కేంద్రాల నిర్వాహకులు పంచాయతీ అధికారులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మీసే వలో దరఖాస్తు చేసుకుని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు కూడా రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సర్పంచులతో విభేదాలు
ఏళ్లుగా పంచాయతీల్లో పాతుకుపోయిన కొందరు కార్యదర్శులు సర్పంచులకు సహకరించడం లేదని బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సర్పంచులు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్యదర్శులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
కొరవడిన పర్యవేక్షణ..
జిల్లాలోని 15 మండలాల్లో 335 పంచాయతీలు ఉండగా, 300 మందికి పైగా కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో యువతే ఎక్కువగా ఉండడంతో చాలామంది లక్ష్యంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగాా తీర్చిదిద్దుతున్నారు. మరికొందరు మాత్రం ధరలు నిర్ణయించి పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మండల కేంద్రాల్లో పెద్దఎత్తున కొత్త ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్‌వోసీలు, ఇంటి నంబర్లు, ఇతర అనుమతులకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు, కొత్త విద్యుత్ మీటరు, మ్యారేజ్, బర్త్, డెత్ సర్టిఫికెట్లకు కూడా ధరలు నిర్ణయిస్తున్నట్లు సమాచారం.
ఎంపీడీవో, కార్యదర్శిపై కేసు
సిర్పూర్(టి) పంచాయతీలో నకిలీ జనన ధ్రువపత్రం జారీ చేసిన వ్యవహారంలో గతంలో విధులు నిర్వర్తించిన ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి తిరుపతిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 8న కేసు నమోదైంది. 2011లో ఇతర ప్రాంతంలో జన్మించిన బాలికకు 2007 లో సిర్పూర్(టి)లో జన్మించినట్లు నకిలీ జనన పత్రం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


