పూర్తయిన ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జి.. మహారాష్ట్ర సరిహద్దులో రూ.22 కోట్లతో నిర్మాణం వంతెన స్లాబ్‌పై మొక్కల పెంపకానికి చర్యలు వన్యప్రాణులు సాఫీగా రోడ్డు దాటేలా.. 150 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో నిర్మాణం సహజ అడవిగా రూపొందించడమే లక్ష్యంగా పనులు
వాంకిడి: వన్యప్రాణులు సాఫీగా రోడ్డు దాటేలా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో నిర్మించిన ఎకో బ్రిడ్జి (వంతెన) పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మంచిర్యాల నుంచి కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి–363పై వన్యప్రాణులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రెబ్బెన సమీపంలో పులికుంట వద్ద, వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద ప్రత్యేక వంతెనల నిర్మాణం చేపట్టారు. రూ.22 కోట్లతో వాంకిడి మండలంలో ఎకో బ్రిడ్జి (వన్యప్రాణులు రహదారిపై నుంచి వెళ్లేలా), రెబ్బెనలో రూ.20 కోట్లతో అండర్ పాస్ (వన్యప్రాణులు రహదారి కింది నుంచి వెళ్లేలా) వంతెనల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉండగా ఈ మార్గం గుండానే పులులు, చిరుతలు, తదితర వన్యప్రాణులు అడవులు మారుతుంటాయి. ఈ క్రమంలో వాహనదారులు రోడ్డుపైకి వచ్చే జంతువులను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడటమే కాకుండా వన్యప్రాణులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ సమయంలో అటవీశాఖ వైల్డ్‌లైఫ్ అధికారులు దీనికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వంతెనల నిర్మాణాలను ప్రతిపాదించారు.
2024లో వంతెన దాటిన పులి..
వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో రహదారికి ఇరువైపులా దట్టమైన అడవులు ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి కాగజ్‌నగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులులు, చిరుతల సంచారం ఉంటుంది. ప్రతీ సంవత్సరం చలికాలంలో ఈ అడవుల గుండా వీటి కదలికలు ఉంటున్నాయి. అయితే 2024లో ఒక పెద్ద పులి ఈ వంతెన పైనుంచి అడవి దాటినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పెద్ద పులి వంతెన దాటి మరో వైపునకు వెళ్తుండగా వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో వంతెన నిర్మాణం సఫలీకృతమైనట్లు అధికారులు సైతం భావిస్తున్నారు. వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు వంతెన పైన కెమెరాను ఏర్పాటు చేశారు. పైనుంచి వెళ్లే జంతువులు రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా ఐరన్ జాలితో కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొక్కలు నాటుతుండటంతో వన్యప్రాణులకు వంతెన మరింత సౌకర్యవంతంగా మారనుంది.
పులులు, చిరుతలు, జింకలు, కోతులు, ఏలుగుబంట్లు వంటి తదితర వన్యప్రాణులు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే రహదారులు అటవీ ప్రాంతాల గుండానే ఉండటంతో వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో వేగంగా వచ్చే వాహనాలను ఢీకొని చనిపోయేవి. అటవీశాఖ తీసుకున్న ఓవర్‌పాస్, అండర్ పాస్ వంతెనల ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. వాంకిడి మండలం గోయేగాం సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారి–363 నిర్మాణ సమయంలోనే 2022లో ఎకో బ్రిడ్జీ పనులు ప్రారంభించారు. ఏడాదిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ వంతెన స్లాబ్‌పైనా మట్టి వేయడం, మొక్కలు నాటడం వంటి పనుల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు వంతెనను సందర్శించి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. స్లాబ్‌పై మట్టి వేసేలా వంతెన నిర్మాణ యాజమాన్యాన్ని ఆదేశించగా ఇటీవల పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పలురకాల గడ్డి జాతి మొక్కలు నాటుతున్నారు. ఈ వర్షాకాలంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వన్యప్రాణులకు సహజ అడవి వాతావరణాన్ని కల్పిస్తాయి. దీంతో పులులు, చిరుతలు వంటి వన్య మృగాలు రోడ్డుపైకి రాకుండా పైనుంచే సంచరించనున్నాయి.


