ఆరుతడి వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి వైపు అడుగులు

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

సంప్రదాయ పంటల స్థానంలో కంది, పెసర సాగు అందుబాటులో విత్తనాలు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

చిత్రంలో కనిపిస్తున్న లోడుపల్లి గ్రామానికి చెందిన రైతు పేరు సికిరం బోరయ్య. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఇటీవల పత్తి విత్తనాలు నాటాడు. మండుతున్న ఎండలతో పత్తి మొలకలు చనిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి సాగు చేసిన చేనులో కంది వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నాడు.

పెంచికల్‌పేట్‌: జిల్లాలో ఆశించిన స్థాయిలో వానలు కురియకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌, జూలై మాసాల్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన పత్తి పంటలు మండుతున్న ఎండలకు నీటి కొరతతో మొలకదశలోనే దెబ్బతింటున్నాయి. వర్షాధారం, చెరువులు, కుంటలు, కాలువల కింద వరి నారుమడులు మాడిపోతున్నాయి. వర్షాల కొరతతో జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. జిల్లాలోని రైతు వేదికల్లో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలుగా సుమారు 23 వేల ఎకరాల్లో కంది, 2 వేల ఎకరాల్లో పెసర్లు సాగు చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతులకు అవగాహన సదస్సులు

ఎల్‌నినో నేపథ్యంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడిచినా నేటికీ అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడానికి గ్రామాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో పండే కంది, జొన్న, పెసర్లు, ఇతర చిరుధాన్యాల పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు. మొలకెత్తని పత్తి, వరి సాగు చేసే పొలాల్లో జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు కంది, పెసర పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.

వరికి ప్రత్యామ్నాయం..

జిల్లాలోని 15 మండలాల్లో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలు సుమారు 50 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది లోటు వర్షపాతం నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు, బావులపైన ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జూన్‌, జూలై మాసాల్లో కురిసిన మోస్తరు వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. నెలరోజులుగా వర్షాలు లేకపోవడంతో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement