ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు చేస్తున్న పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్‌వో దాసరి వేణుకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 1996 భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించకుండా జీవో నం.12 జారీ చేసి ప్రజాధనాన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం దారుణమన్నారు. అర్హులకు 15 రోజుల్లోగా లేబర్ కార్డులు జారీ చేయాలని, వలస కార్మికులను వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, నా యకులు గౌస్‌బాబా, కమలాకర్, అశోక్, రవి, రాంచందర్, నవీన్, సదయ్య, నర్సయ్య, శంకర్, రావుజీ, మధు తదితరులు పాల్గొన్నారు.


