ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి నాలుగు జిల్లాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ఉట్నూర్‌లో సమీక్ష మంచిర్యాల కలెక్టర్, అటవీశాఖ అధికారులు గైర్హాజరు
ఉట్నూర్‌రూరల్: ఎల్‌నినో విపత్తు నుంచి బయటపడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. ఉట్నూర్‌లోని పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావం– ప్రత్యామ్నాయ చర్యలపై సోమవారం ఉమ్మడి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోగ్య సమస్య దృష్ట్యా రాలేకపోయారని, మంత్రి ఆదేశాల మేరకే తాను హాజరైనట్లు ఇల్లంబర్తి స్పష్టం చేశారు. ఉట్నూర్ పీవోగా గతంలో విధులు నిర్వర్తించానని, ఉమ్మడి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో తీవ్ర వ్యాధులు సంక్రమించేవని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్త్తృత అవగాహన కల్పించాలన్నారు. కంది, పెసర, నువ్వు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా జలాశయాలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎల్ నినో బుక్‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్‌ను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా, కుమురంభీం కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు హాజరుకాగా మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ గైర్హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
సమావేశంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామగోపాల్‌వర్మ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులు, పంటల సాగులో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, రక్షణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో చర్చించిన కీలక అంశాలను, క్షేత్రస్థాయి సమస్యలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఇల్లంబర్తి హామీ ఇచ్చారు. సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్ చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మాట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పి.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


