పెద్దాస్పత్రికి ఖాళీల సుస్తీ! | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రికి ఖాళీల సుస్తీ!

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత సర్జరీలు జరగక గర్భిణులకు కష్టకాలం సీరియస్‌ కేసులు మంచిర్యాలకే రెఫర్‌.. జిల్లాలో పనిచేసేందుకు డాక్టర్ల విముఖత..!

ఆసిఫాబాద్‌: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు విజృంభించే ప్రమా దం ఉంది. ఇలాంటి తరుణంలో జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత ప్రజలకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఓపీలో ఒక్కో డాక్టర్‌ 150 మంది వరకు రో గులను చూడాల్సి రావడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో సీరియస్‌ కేసులను మంచిర్యాలకు.. అక్కడి నుంచి వరంగల్‌కు రెఫర్‌ చేస్తున్నారు. రాత్రిపూట డ్యూటీ డాక్టర్లు తక్కువగా ఉండడంతో ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందడం లేదు.

500 నుంచి 600 వరకు ఔట్‌పేషెంట్లు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి గతంలో వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉండేది. మూడేళ్లక్రితం వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంతో అనుబంధ బోధనాస్పత్రిగా మారింది. 50 పడకల స్థాయి నుంచి 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రతిరోజూ 500 నుంచి 600 మంది ఔట్‌ పేషెంట్లు, 200 వరకు ఇన్‌పేషెంట్లు నమోదవుతున్నారు. మూడు నెలల్లో 24,012 ఔట్‌ పేషెంట్లు రాగా, 168 సర్జరీలు, 89 ప్రసవాలు, 8,933 అడ్మిషన్లు జరిగాయి. చుట్టుపక్కల మండలాల ప్రజలు వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. గైనకాలజిస్టు లేక అత్యవసర పరిస్థితుల్లో సాధారణ వైద్యులు, నర్సులే కాన్పులు చేస్తున్నారు. ఇక కార్డియాలజీ సేవలు అందని ద్రాక్షగానే మిగిలాయి.

గర్భిణులకు ప్రసవ వేదన..

ఆస్పత్రిలో గైనకాలజిస్టులు, మత్తు డాక్టర్లు లేకపోవడంతో సాధారణ కాన్పులు మాత్రమే జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. అత్యవసర సమయంలో సిజేరియన్లు చేయడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీలకు రూ.వేలు చెల్లిస్తున్నారు.

ఈ సేవలు మెరుగు

జిలా ఆస్పత్రి పరిధిలో 65 మంది డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులుండగా, ఐదు డయాలసిస్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రతిరోజూ 48 మందికి డయాలసిస్‌ చేస్తుండగా, మిగితా 16 మంది వెయిటింగ్‌లో ఉంటున్నారు. మరో ఐదు డయాలసిస్‌ యూనిట్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రోగులందరికీ డయాలసిస్‌ సేవలు అందించే వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం ఆర్థోపెడిక్‌ వైద్యుల సేవలు మెరుగుపడటంతో క్షతగాత్రులకు ఇక్కడే సిమెంటు పట్టీలు వేస్తున్నారు. రేడియాలజిస్టు విధుల్లో చేరడంతో గర్భిణులు, ఇతరులకు 60 మంది స్కానింగ్‌ చేస్తున్నారు. కిమోథెరపీ కేంద్రం ఏర్పాటు చేయగా ముగ్గురు పేషెంట్లకు సేవలందిస్తున్నారు. మైత్రీ క్లినిక్‌లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లకు చికిత్స అందిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ 10 నుంచి 20 మంది చేరుతున్నారు.

పోస్టులున్నా.. వైద్యులేరి

జిల్లా ఆస్పత్రిలో 210 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. కానీ 22 మంది పనిచేస్తున్నారు. 188 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 95 కాంట్రాక్టు వైద్యులకు 11 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లకు ఒక్కరే ఉన్నారు. ఏడుగురు ఆర్‌ఎంవోలు, ఆరుగురు క్యాజువాలిటీ మెడికల్‌ అధికారులు, 11 మంది స్పెషలైజేషన్‌ వైద్యులకు ఒక్కరు కూడా లేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లే అదనపు విధులు నిర్వహించాల్సి వస్తోంది. 70 మంది సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు రాగా 53 మంది హైదరాబాద్‌లోని కుద్బుల్లాపూర్‌కు వెళ్లిపోయారు. నెల రోజుల క్రితం వైద్య కళాశాలకు 28 మంది వైద్యులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో చేరడం గమనార్హం. జిల్లాలో పనిచేసేందుకు కొందరు డాక్టర్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. 203 మంది స్టాఫ్‌ నర్సులకు 165 మంది ఉన్నారు. వీరిలో 20 మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌ వేయించుకున్నారు. రౌండ్‌ది క్లాక్‌ 18 మంది మత్తు డాక్టర్లకు కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఐసీయూ సెటప్‌ వైద్యులు లేకపోవడంతో సర్జరీలు జరగడం లేదు. ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌, మైక్రో బయాలజీ సిబ్బంది లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement