గుర్తింపు దడ! | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు దడ!

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

సిర్పూర్‌ నియోజకవర్గంలో బంగ్లాదేశీ హిందువుల నివాసం పలువురికి పౌరసత్వం లేకుండానే ఓటుహక్కు సర్‌ ప్రక్రియతో వెలుగులోకి కొత్త విషయాలు ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపి ఇవ్వాలని అధికారుల సూచన

బంగ్లాదేశ్‌లోని కుల్నా ప్రాంతం నుంచి 2009లో ఓ కుటుంబం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌– 1 గ్రామానికి వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రులు పెద్దకుమారుడు, కోడలు, చిన్న కుమారుడితో గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న తమ బంధువుల సహకారంతో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఈ కుటుంబానికి 2013లో ఓటు హక్కు లభించింది. వీరిలో చిన్న కుమారుడు స్థానిక యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్వేలో వీరు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినట్లు వెల్లడైంది.

చింతలమానెపల్లి: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. జిల్లాలో పౌరసత్వం లేకుండా స్థిరపడిన బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ కుటుంబాలను అధికారులు గుర్తిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు సమయంలో 1965లో వలస వచ్చిన వారికి అప్పటి కేంద్ర ప్రభుత్వం సిర్పూర్‌ నియోజకవర్గంలో ఆవాసం కల్పించింది. ప్రస్తుతం కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), చింతలమానెపల్లి మండలాల్లో బెంగాలీలు నివసిస్తున్నా రు. ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు అందించింది. అయితే కాలక్రమేణా వారి బంధువులు కూ డా పౌరసత్వం లేకుండానే వలస రావడం ప్రారంభించారు. ప్రస్తుతం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌– 1లో సుమారు 10 మంది, రవీంద్రనగర్‌– 2లో మరో 12 మంది వరకు నివాసం ఉంటున్నట్లు సమాచారం. కాగజ్‌నగర్‌ మండలం ఈస్‌గాం, నజృల్‌నగర్‌, సీతానగర్‌, నామానగర్‌ సహా బెంగాలీలు నివాసముండే పంచాయతీల్లో మరో 50 కుటుంబాల వరకు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఉంటున్నట్లు అంచనా..

2010 తర్వాత ఓటుహక్కు

బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌, కుల్నా, జాసోర్‌ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హిందువులు వలస వచ్చారు. జిల్లాలో ఉంటున్న స్థానిక బెంగాలీలతో ఉన్న బంధుత్వం ఆధారంగా 2000 తర్వాత మరి కొంత మంది వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉండలేక సాగు భూములు, ఇళ్లు అన్నీ వదిలేసి వచ్చామని, అప్పట్లో ఇచ్చిన సరిహద్దు రశీదు మినహా తమ వద్ద ఏమీ లేవని వారు చెబుతున్నారు. రవీంద్రనగర్‌, ఈస్‌గాం ప్రాంతాల్లో 2000 అనంతరం సరిహద్దు రశీదుతో వచ్చిన వారు 2010 తర్వాత ఇక్కడ ఓటుహక్కు పొందారు. వీరికి సంబంధించి ఎలాంటి వివరాలు 2002 ఓటరు జాబితాలో లేవు. 400 నుంచి 500 మంది వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరి ఎన్యూమరేషన్‌ ఫారాలను ఆన్‌లైన్‌ చేయాలా వద్దా అనే అనుమానంలో బీఎల్‌వోలు ఉన్నారు. స్థానికంగా పోలీసు అధికారులు సైతం ఆరా తీసినట్లుగా సమాచారం.

ధ్రువీకరణ తప్పనిసరి

2002లో ఓటుహక్కు లేకపోవడం, బంధువులకు సైతం అప్పుడు ఓటుహక్కు లేకపోతే ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. అనామలి, లేదా అన్‌ మ్యాప్‌డ్‌ కేటగిరీగా పరిగణిస్తున్నారు. వీరంతా భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. 2002 ఓటరు జాబితాతో లింక్‌ లేని ఓటర్లకు వ్యక్తిగత విచారణ కోసం నోటీసులు జారీ చేస్తారు. ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి కేటాయించిన సమయానికి సంబంధిత కార్యాలయానికి వెళ్లి స్థానికతను ధ్రువీకరించుకోవాలి. అధికారులు సంతృప్తి చెందితే ఓటుహక్కును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటారు.

ఫారాలు నింపి బీఎల్‌వోలకు ఇవ్వాలి

జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన పరందోళితోపాటు సిర్పూర్‌ నియోజకవర్గంలోని ఈస్‌గాం, రవీంద్రనగర్‌ ప్రాంతాల్లో సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటర్లు ఆందోళనకు గురి కావొద్దు. తమకు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాలను నింపి బీఎల్‌వోలకు ఇవ్వాలి. సమస్యలు ఉన్న ఓటర్ల వివరాలను సంబంధిత ఆర్డీవోలు విచారిస్తారు.

– లోకేశ్వర్‌, ఆసిఫాబాద్‌ ఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement