పెంచికల్‌పేట్: బొక్కవాగు ప్రాజెక్టు రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రాజెక్టు గేటుకు నూతన షెటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ వద్ద బొక్కివాగుపై రెండు వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.18 కోట్ల నిధులతో ప్రాజెక్టును నిర్మించింది. కొన్నేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో ప్రాజెక్టు నుంచి నిరంతరాయంగా నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్టు కింద రైతులు సాగు చేస్తున్న పంటలకు చివరి తడులు అందని పరిస్థితి నెలకొంది. తూముకు మరమ్మతులు చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించారు.
ఎమ్మెల్యే చొరవతో ఏర్పాటు..
ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు దృష్టికి ప్రాజెక్టు సమస్యను తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఇటీవల మరమ్మతులు చేపట్టి నూతన షటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. సమస్య పరిష్కారం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


