ఆర్‌ఎంపీ వైద్యం.. ప్రాణాంతకం! | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ వైద్యం.. ప్రాణాంతకం!

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

ఆర్‌ఎంపీ వైద్యం.. ప్రాణాంతకం!

ఆర్‌ఎంపీ వైద్యం.. ప్రాణాంతకం!

● అర్హత లేకపోయినా చికిత్సలు ● చర్యలు తీసుకోని వైద్యారోగ్య శాఖ ● రోగుల ప్రాణాలతో చెలగాటం

చింతలమానెపల్లి: వైద్యంపై కనీస పరిజ్ఞానం లేని ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స రోగులకు ప్రాణ సంకటంగా మారింది. అర్హత లేకున్నా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతగా మందులు రాయ డం, పరిధికి మించి ఇంజక్షన్‌లు వేయడం, మందులు విక్రయించడం చేస్తున్నారు. కొంతమంది కొన్ని నెలల పాటు ఆర్‌ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసి ఆతర్వాత నేరుగా వైద్యం అందించేందుకు గ్రామాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్‌ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు బేఖాతర్‌

గతంలో ప్రభుత్వాలు వైద్యం అందించడాన్ని సేవగా భావించి కొంతమేరకు నిబంధనలతో అనుమతులు ఇచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఆర్‌ఎంపీలు లాభాపేక్షతో ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌లలో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స కేంద్రాలను నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ దీనిని బేఖా తరు చేస్తూ ఏకంగా భవనాలలో పడకలను ఏర్పా టు చేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్‌ల పేరిట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా క్లినిక్‌, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకే గ దిలో నిర్వహిస్తున్నారు. మందులు విక్రయించేందు కు ఫార్మసిస్టుగా అర్హత ఉండాలి. కానీ అవేం లేకుండానే ఆర్‌ఎంపీలే రక్తం సేకరించడం, మందులు ఇవ్వడం చేస్తున్నారు. హద్దులు దాటి చేస్తున్న ఈవైద్యం రోగుల ప్రాణాలకు సంకటంగా మారింది.

పునరావృతమవుతున్నా..

ఆర్‌ఎంపీల వైద్యం వికటించి 2023లో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అధిక డోస్‌తో ఇంజక్షన్లు చేయడంతో అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లుగా చికిత్స అందించిన వైద్యులు బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 2024, 2025లో సైతం జిల్లాలో ఆర్‌ఎంపీల వైద్యం వికటించి పలువురు మృత్యువాత పడ్డారు.

దుష్పరిణామాలెన్నో..

జ్వరం, నొప్పిలాంటి రుగ్మతలను తగ్గించడానికి ఆర్‌ఎంపీలు అనుమతిలేని స్టెరాయిడ్‌, హైలెవల్‌ యాంటిబయాటిక్‌ మందులను వినియోగిస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు వినియోగించే మందులను సైతం నేరుగా ఆర్‌ఎంపీలు వినియోగిస్తున్నారు. అనుభవం లేని వైద్యులు అందించే పెయిన్‌ కిల్లర్లు విరివిగా వినియోగిస్తుండడంతో మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల డయాలసిస్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెద్ద రోగాలకు వినియోగించే యాంటిబయాటిక్‌లను విచ్చలవిడిగా వినియోగిస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగి శరీరం స్పందించడంలేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగం నయం చేయడం కష్టంగా మారిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ వైద్యం అందకపోవడమే..

గ్రామాల స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ వై ద్యం అందకపోవడంతోనే రోగులు ఆర్‌ఎంపీలను ఆశ్రయించడానికి కారణంగా తెలుస్తోంది. సరిపడా వైద్య వసతులు లేకపోవడం, వై ద్యులు అందుబాటులో లేకపోవడం, గ్రామాలలో సబ్‌సెంటర్లు ఉన్నా ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రభుత్వ వైద్యం గ్రామీణ ప్రజలకు అందడంలేదు. ప్రజలు ఉన్నా ఆరోగ్య కేంద్రాలు లేకపోవడమూ కారణమే. ఉదాహరణకు చింతలమానెపల్లి మండలం ఏర్పాటై పదేళ్లు కావస్తున్నా ఒకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆరోగ్య కేంద్రంలో సాయంత్రం 5గంటల వరకే విధులు నిర్వహించడంతో రోగులకు ఆర్‌ఎంపీలే దిక్కవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలు పరిమిత స్థాయికే పరిమితమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్రా మీణ మండలాల్లో పనిచేస్తున్న పలువురు వై ద్యులు స్థానిక ఆర్‌ఎంపీలు నిర్వహించే ఆసుపత్రులలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

పరిమితి దాటితే చర్యలు

ఆర్‌ఎంపీ వైద్యులు తమ పరిమితి దాటి చికిత్స చేస్తే చర్యలు తప్పవు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీసు కేసులు నమోదు చేస్తాం. ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఆర్‌ఎంపీలు చికిత్స అందించాలి. చింతగూడ ఘటనలో పోలీసు కేసు నమోదైంది. ప్రభుత్వ వైద్యులు నిర్ణీత వేళల్లో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి.

– సీతారాం, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement