బాలికల భవిష్యత్తుకు టీకా
సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా పంపిణీ సన్నాహాలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ అధికారులు వైద్యులు, వైద్య సిబ్బందికి ముగిసిన శిక్షణ
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళల్లో అధికంగా వస్తున్న గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లాలో 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇదివరకే పీహెచ్‌సీల వారీగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి చేసింది. బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖరీదైన వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వనున్నారు.
100కు పైగా కేసులు నమోదు..
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుందని అధికారులు చెబుతున్నారు. వైరస్ శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నయం కావడానికి అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ అవగాహన లేమితో చాలా మంది పరీక్షలు చేయించుకోకపోవడంతో దీని బారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈక్రమంలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణయించింది.
ఉత్తర్వులు రాగానే టీకాలు
14 సంవత్సరాల వయస్సు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకే వైద్యాధికారులకు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టీకాలు వేస్తాం. ఈ టీకా ద్వారా 83శాతం సర్వైకల్ క్యాన్సర్ సోకకుండా నియంత్రించవచ్చు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నియంత్రణకు టీకా రక్షణ కల్పిస్తుంది.
– సీతారాం, డీఎంహెచ్‌వో
జిల్లా వ్యాప్తంగా సర్వే..
సర్వైకల్ క్యాన్సర్‌ను నియంత్రించే హెచ్‌పీవీ టీకాను కిశోర బాలికలకు ఇవ్వాలని నిర్ణయించిన దృష్ట్యా దీనిపై ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. వైద్యారోగ్య లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 4వేల మంది కిశోర బాలికలు ఉంటారని అంచనాలు ఉన్నాయి. వారికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేస్తే భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
బాలికల భవిష్యత్తుకు టీకా
బాలికల భవిష్యత్తుకు టీకా


