
నవ భారతం నిర్మించుకుందాం
‘సాక్షి’ టాక్‌షోలో పాల్గొన్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు
ఆసిఫాబాద్‌రూరల్: ‘పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అంటరానితనం రూపుమాపి, 2047 నాటికి నవ భారతం నిర్మించుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియా ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఎదగాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి’ అంటూ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన భారతదేశం సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. నేడు(శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్నాం. ఈ నేపథ్యంలో 2047 నాటికి వందేళ్ల స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలనే అంశంపై గురువారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించింది. స్వేచ్ఛను పొంది వందేళ్లు పూర్తయ్యే నాటికి ఆర్థిక, సాంఘిక వెనుకబాటు పూర్తిగా తొలగిపోయి, నవ భారతంలోకి భవిష్యత్తు తరాలు అడుగు పెట్టాలని విద్యార్థినులు ఆకాంక్షించారు.