
మద్యానికి దూరం.. చారిగాం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషేఽ దానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూరగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్‌లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు.
అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్‌నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.