
‘దిందా’ రైతుల అరెస్టు
కాగజ్‌నగర్‌టౌన్/చింతలమానెపల్లి/కౌటాల/ వాంకిడి: పోడు భూములపై హక్కుల కోసం ఈ నెల 6న హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ రైతులను గురువారం పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు రాజధానికి చేరుకునే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి దిందాకు తీసుకువస్తుండగా వారి బస్సును కాగజ్‌నగర్ మండలం కోసిని వద్ద బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోడు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ ప్రేంమకుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసి కౌటాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐదు గంటలపాటు స్టేషన్‌లో ఉంచి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి దిందా రైతుల ఉసురు తాకుతుందన్నారు. అక్రమ అరెస్టులతో అన్నదాతలను అణిచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ క్యాంప్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు దాసరి ఉష, విశ్వనాథ్, లెండుగురే శ్యాంరావు, నాందేవ్, బండు, హర్షద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు
పాదయాత్రగా వెళ్లిన రైతులకు మద్దతు తెలిపేందుకు పలువురు దిందా గ్రామస్తులు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ శివారులో ఎస్సై ఇస్లావత్ నరేశ్ ఆధ్వర్యంలో పోలీసుల అడ్డుకోని వారిని సముదాయించారు.
న్యాయం జరిగేవరకు పోరాడుతాం..
న్యాయం జరిగేవరకు పోరాడుతామని చింతలమానెపల్లి మండలం దిందాకు చెందిన పోడు రైతులు అన్నారు. వాంకిడి పోలీస్‌స్టేషన్‌లో వారు మాట్లాడారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు అటవీ శాఖ అధికారులు కంచెలు ఏర్పాటు చేశారని, వ్యవసాయ పనులకు వెళ్తే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూములు తమకు అప్పగించాలని కోరేందుకు సుమారు 60 మంది పాదయాత్రగా హైదరాబాద్ బాట పట్టినట్లు తెలిపారు. వాంకిడి పోలీస్ స్టేషన్‌కు సుమారు 20 మంది రైతులను తరలించగా మిగిలిన వారిని కాగజ్‌నగర్, రెబ్బెన పోలీస్ స్టేషన్‌లకు తరలించినట్లు సమాచారం.

‘దిందా’ రైతుల అరెస్టు