అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజల సంక్షేమం కోసం అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయాలని, కలెక్టర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ గతంతో పోల్చితే ఈ ఏడాది వరి ధాన్యం సేకరణ అధికంగా జరిగిందన్నారు. భూభారతి చట్టంలో భాగంగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలి పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ను లక్ష్యాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్‌డీవో దత్తారావు, గృహనిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


