
సమ్మె నోటీసు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆశవర్కర్లు పాల్గొంటున్నట్లు సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకువచ్చిందని తెలిపారు. కోడ్‌లు అమలు చేస్తే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు. సమ్మెలో ఆశవర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణమాచారి, ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, నాయకులు నిర్మల, ద్రౌపది, శోభ, యశోద, సావిత్రి, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో..
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన నోటీసును జేఏసీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పెరిక నగేశ్, శ్రీకాంత్, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8గంటల పనిదినాన్ని అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51 సవరించాలని, మల్టీపర్సనల్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. జిల్లాలోని కార్మికులు సమ్మె విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.