సమ్మర్ క్యాంపులకు సై
● జిల్లాలో నేటి నుంచి 10 శిబిరాల్లో శిక్షణ ● ఈ నెల 31 వరకు నిర్వహణ
ఆసిఫాబాద్‌రూరల్/ఆసిఫాబాద్‌అర్బన్: సమ్మర్ క్యాంపులకు సమయం ఆసన్నమైంది. యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. పది క్రీడాంశాల్లో గురువారం నుంచి నెలరోజులపాటు బాలబాలికలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. మానసికోల్లాసం, దేహదారుఢ్యంపాటు స్నేహభావం పెంచేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో పది కేంద్రాలు
జిల్లాలోని మూడు మండలాల్లో పది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం పది క్రీడాంశాల్లో పది మంది శిక్షకులను ఎంపిక చేశారు. వారికి కేటాయించిన క్రీడల్లో ఈ నెల 1 నుంచి 31 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన క్రీడాసామగ్రి సైతం అందించనున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్, రాజంపేట్, బూర్గుడ, తిర్యాణి మండలంలోని రొంపెల్లి, తిర్యాణి, రాళ్లకన్నెల్లి, కాగజ్‌నగర్‌లోని బురదగూడ, సారండి, వెంపల్లి, నజ్రుల్‌నగర్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యం పెంచేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 40 మంది నుంచి 50 మంది విద్యార్థుల వరకు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.


