స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం ● ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు, మంచిర్యాలకు ఇద్దరు..
ఆదిలాబాద్‌టౌన్: స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల 38 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు (భార్య, భర్త) ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వ చ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు) బదిలీపై రానుండగా, ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రం ఎస్‌ఏలు బదిలీపై వెళ్లనున్నారు. 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరట కల్పించింది.
23న రిలీవ్..
సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22న రిలీవ్ అయి వారికి కేటాయించిన జిల్లాలో 23న విధుల్లో చేరాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాకు 24 మంది మ్యూచువల్ బదిలీపై రానుండగా, అదే సంఖ్యలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లనున్నారు. మంచిర్యాల నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడి నుంచి ఒకరు మంచిర్యాలకు వెళ్లనున్నారు.


