ఆరు నెలల్లో పూర్తి చేస్తాం..
● ఐదంతస్తుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు ● ఇప్పటికీ కనీసం పూర్తికాని స్లాబ్‌ల నిర్మాణం
ఖమ్మంఅర్బన్: జిల్లా యువతకు ఐటీ రంగంలో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఖమ్మం ఐటీ హబ్–2 నిర్మాణ పనులు ఎంతకూ పూర్తికావడం లేదు. రూ. 36 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనానికి 2021 ఏప్రిల్ 2న అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు లక్ష చదర పు అడుగుల విస్తీర్ణంలో 570 మంది ఒకేసారి పనిచేసేలా భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.
1,500 మందికి అవకాశం
ప్రస్తుతం కొనసాగుతున్న ఐటీ హబ్ మొదటి దశకుతోడు రెండో దశ భవనం అందుబాటులోకి వస్తే మూడు షిఫ్టుల్లో సుమారు 1,500మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి దశ ద్వారా స్థానిక ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకా శాలు లభిస్తున్నాయి. ఈ మేరకు రెండోదశ భవనం కూడా పూర్తయితే జిల్లాలో ఏటా పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు పూర్తిచేసిన వారు హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉండదు.
స్లాబ్ దశలోనే పనులు
ఐదేళ్ల క్రితం భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగగా, ఆతర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో అంతస్తు స్లాబ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. మొత్తం ఆరు స్లాబ్‌లతో ఐదు అంతస్తుల భవనం నిర్మించాల్సి ఉంది. త్వరలోనే మూడో అంతస్తు స్లాబ్ పూర్తవుతుందని, ఆతర్వాత నెలకొక స్లాబ్ చొప్పున మూడు, నాలుగు నెలల్లో స్లాబ్‌లు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయాన మిగిలిన పనులను సమాంతరంగా చేపడతామని అధికారులు చెబుతున్నా పరిస్థితిని పరిశీలిస్తే అనుమానంగానే కనిపిస్తోంది.
జాప్యానికి కారణాలు
నిర్మాణ పనుల్లో జాప్యానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డ్రాయింగ్ వ్యవస్థకు సంబంధించి కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు మృతి చెందడంతో కొంతకాలం పనులు మందగించాయన్నారు. దీనికి తోడు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కూడా ప్రభావం చూపిందని సమాచారం. కారణాలు ఏమైనా ఏళ్ల తరబడి నిర్మాణం కొనసాగుతుండటంపై నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ఐటీ హబ్–2 పనులు రకరకాల కారణాలతో జాప్యం జరిగాయి. నేను బాధ్యతలు చేపట్టి మూడు నెలలే అవుతోంది. రోజువారీగా పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెరిగేలా పర్యవేక్షిస్తున్నా. రానున్న ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– బి.రాంమోహన్‌రాజు, టీజీఐఐసీ,
జోనల్ డిప్యూటీ మేనేజర్


