మణికొండ: ఓ వ్యక్తిని క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి దారుణంగా హత్య చేసిన నిందితులు.. కోకాపేట నియోపోలీస్ వెంచర్ పక్కనే ఉన్న కురుమ సంఘం భవనం ముందు పడేశారు. శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కోకాపేటలోని కురుమ సంఘం భవనం ముందు మృతదేహం ఉందనే సమాచారంతో పరిశీలించగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువుకు చెందని కాంపాటి వెంకన్న(45)గా గుర్తించారు. వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ వడ్డీకి డబ్బులు ఇచ్చి కార్లు, ద్విచక్ర వాహనాలను తాకట్టు పెట్టుకుంటాడు. ఆయన మృతదేహం వద్ద లభించిన కారు కూడా శ్రీకాంత్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి తాకట్టు పెట్టుకున్నదిగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య, పిల్లలకు బేదాభిప్రాయాల కారణంగా దూరం ఉంటున్నాడు. కాగా, వెంకన్నను వేరే ప్రాంతాలో హత్య చేసి తెచ్చి మృతదేహాన్ని ఇక్కడ వేశారా.. ఇక్కడే హత్య చేశారా.. హత్యకు వడ్డీ లావాదేవీలే కారణమా అన్నది తేలాల్సి ఉందని డీసీపీ తెలిపారు.
ఎదుళ్లచెరువులో విషాదం
తిరుమలాయపాలెం: హైదరాబాద్ కాంపాటి వెంకన్న హత్యతో ఆయన స్వగ్రామమైన ఎదుళ్లచెరువులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కాంపాటి జగన్నాథం పూలమ్మ దంపతులకు వెంకన్నతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీసీ చేస్తూ విద్యార్థి ఉద్యమాలతో పాటు బీసీ ఉద్యమాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తండ్రి జగన్నాథం కొన్నేళ్ల క్రితం మృతి చెందగా బుధవారం ఆయన వర్ధంతి కావడం, అదేరోజు రాత్రి వెంకన్న హత్యకు గురవడంతో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కాగా, వెంకన్న మృతిపై సర్పంచ్ ఆరెంపుల వినోద, వివిధ సంఘాల నాయకులు మందడి ఇజ్రాయిల్ తదితరులు సంతాపం తెలిపారు.
తండ్రి వర్ధంతి రోజే ఘటన


