డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యాన వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యాన వైద్య శిబిరం

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

ఖమ్మంలీగల్‌: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యాన ఈశ్వరమ్మ ప్రశాంతిసదన్‌ మహిళా వృద్ధాశ్రమంలో గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.దేవీమానస శిబిరాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నల్సా సీనియర్‌ సిటిిజన్స్‌ పథకం, తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ, సంక్షేమచట్టంపై అవగాహన కల్పించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బి.వేణుమాధవ్‌రావు, మెడికల్‌ ఆఫీసర్‌ ఎన్‌.కృష్ణచైతన్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

తగ్గిన పామాయిల్‌ గెలల ధర

● టన్నుకు రూ.384 తగ్గుదల

అశ్వారావుపేటరూరల్‌: గడిచిన నెలతో పోలిస్తే పామాయిల్‌ గెలల టన్ను ధర తగ్గింది. ఈమేరకు గురువారం ఆయిల్‌ఫెడ్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధరపై సమీక్షించారు. ఈ క్రమాన టన్ను పామాయిల్‌ గెలల ధర రూ.24,025 నుంచి రూ.23,641కు తగ్గిందని అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్‌ డీఓ శంకర్‌ తెలిపారు. టన్నుకు రూ.384 చొప్పున తగ్గడంతో ఆయిల్‌పామ్‌ రైతుల్లో ఆందోళన నెలకొంది.

వజ్రాయుధం.. సమాచార హక్కు చట్టం

ఖమ్మం సహకారనగర్‌: సమాచార హక్కు చట్టం సామాన్యులకు వజ్రాయుధం వంటిదని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ పీ.వీ.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం ఎస్‌ఆర్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ‘సమాచార హక్కు చట్టం – స్వరూప స్వభావాలు’ అంశంపై గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలు, చరిత్ర, గతం వర్తమానం, భవిష్యత్‌ను విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. జవాబుదారీతనం ఉండాలనే ఆలోచనతో వచ్చిన చట్టంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ జకీరుల్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఏఎల్‌ఎన్‌.శాస్త్రి, ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ రమా సత్యవతితో పాటు వంజాకుల లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, బంగారా, డాక్టర్‌ వై.రవివర్దన్‌, డాక్టర్‌ లక్ష్మణరావు, పి.నర్సింహారావు, అజిత్‌, అప్పారావు, కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసులో

ఏడాది కఠిన కారాగార శిక్ష

ఖమ్మం లీగల్‌: హత్యాయత్నానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో ఒకరికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి వసుకుల సీనయ్య గురువారం తీర్పు చెప్పారు. కొణిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన పంప్‌ ఆపరేటర్‌ ధరావత్‌ సీతారాములు, అదే గ్రామవాసి బానోత్‌ బాలాజీ మధ్య 2025 మార్చి 15న డ్రెయినేజీ తీసే విషయమై గొడవ జరిగింది. ఈక్రమాన సీతారాములు తన చేతిలోనే పారతో బాలాజీ తలపై కొట్టగా తీవ్ర రక్తస్త్రావమైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం సీతారాములకు ఏడాది కఠిన కారాగార శిక్షతో రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిగా ఎస్సై ఏ.సూరజ్‌, వ్యవహరించిన ఈ కేసును ప్రాసిక్యూషన్‌ తరపున ఏపీపీ పీ.వీ.డీ.లక్ష్మి వాదించారు. విచారణకు ఉద్యోగులు మల్లిక్‌ హరిరావు, ఓ.శ్రీకాంత్‌, సయ్యద్‌ యూసఫ్‌ సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement