గత కొన్నేళ్లుగా జిల్లాలో ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి
● పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు అవకాశం ● ఈనెల 30వ తేదీ వరకు గడువు
ఖమ్మంసహకారనగర్: చదువు మధ్యలో మానేసిన వారితో పాటు ఎలాంటి విద్యార్హతలు లేని వారికి ఓపెన్ స్కూల్ విధానం వరంలా మారుతోంది. అలాగే, తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు చేస్తూ పదోన్నతుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ విధానం ఉపయోగపడనుంది. రెగ్యులర్‌గా చదివే వారితో సమాన అవకాశాలు ఉన్నందున ఓపెన్ స్కూల్ విధానంలో చదివేందుకు వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలే కాక డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్ తదితర అవసరాలకు కూడా విద్యార్హత సర్టిఫికెట్ ఉపయోగపడుతుందనే భావనతో పలువురు ముందుకొస్తున్నారు.
జిల్లాలో 27 అభ్యసన కేంద్రాలు
ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్‌మీడియట్ బోధనకు 27 అభ్యసన కేంద్రాల ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతికి అర్హులు. టీసీ, రికార్డు షీట్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ సరిపోతుంది. ఇక 15ఏళ్లు నిండి పదో తరగతి పాసైన వారంతా ఇంటర్మీడియట్ చదవొచ్చు. ప్రతీనెలా ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో తరగతులు నిర్వహించనున్నారు.
ఈనెల 30వ తేదీ వరకు గడువు..
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం పొందాలనుకునే వారు ఈనెల 30 తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లించి అధ్యయన కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. www. telanganaopenschools. org వెబ్‌సైట్‌లో సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీ సేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో సైతం రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
ఫీజుల వివరాలిలా...
పదో తరగతిలో ప్రవేశానికి ఓసీ పురుషులు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, మైనార్టీలు, మహిళలైతే రూ.1,150 చెల్లించాలి. ఇంటర్మీడియట్‌కు జనరల్ పురుషులు రూ.1,800, మహిళలు, ఇతర కేటగిరీల వారు రూ.1,500తో పాటు జీఎస్‌టీ, సర్వీస్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అధ్యయన కేంద్రంలో దరఖాస్తు ఫారాలు సమర్పించాలి.
ఏడాది పదో తరగతి ఇంటర్‌మీడియట్
2023–24 789 881
2024–25 607 797
2025–26 2089 2,251
2026–27 451 735
(ఇప్పటి వరకు)
ఓపెన్ స్కూల్ ద్వారా జారీ సర్టిఫికెట్లను రెగ్యులర్ కోర్సులతో సమానంగా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాలు, పదోన్నతులకు ఉపయోగించుకోవచ్చు. గతంలో పదో తరగతి, ఇంటర్ పూర్తిచేసిన పలువురు ఉన్నత విద్య చదివారు. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నందున అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.
– కూరపాటి మంగపతిరావు,
ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్


