ఆగమ శాస్త్రానికి అనుగుణంగా..
ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు రాయి వినియోగం
కాంక్రీట్‌కు స్వస్తి.. సంప్రదాయ విధానంలో నిర్మాణాలు
గోకుల రామంలో మొదలైన పనులు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి కొత్తరూపు తీసుకొచ్చేలా చేపట్టిన అభివృద్ధి, పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ విస్తరణలో భాగంగా తొలి ప్రాకారం నుంచి రెండో ప్రాకారం వరకు నిర్మాణాల విస్తరణకు చర్యలు చేపట్టారు. ఈక్రమాన కాంక్రీట్ నిర్మాణాలకు బదులు సంప్రదాయ రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయానికి మరింత శోభ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురుషోత్తపట్నంలోని గోకులరామం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. భారీ రాళ్లను తీసుకు రాగా.. ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆకృతిలో మలుస్తున్నారు. శిల్పులు సంప్రదాయ పద్ధతుల్లో రాయి చెక్కి శిల్పాలుగా తీర్చిదిద్దుతారు.
కృష్ణశిలతో పనులు
భద్రగిరి పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా రామదాసు కాలం నాటి ఆలయం స్ఫురణకు వచ్చేలా నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ప్రాకారాలు, ఉపాలయాలే కాక ఇతర నిర్మాణాలకు పూర్తిగా కృష్ణశిల ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఏపీలోని ప్రకాశం జిల్లా గురురాజపల్లి గ్రామం నుంచి ప్రత్యేకమైన రాయి తెప్పించారు. ముక్కోటి, శ్రీరామనవమి నాటికి పనులు పూర్తికావాలన్న ఆదేశాలతో రెండు బృందాలు శిలలను తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఆలయం వద్ద స్థలం లేకపోవడంతో రామయ్య భూములు ఉన్న పురుషోత్తపట్నంలో ఈ పనులు చేపడుతున్నారు.
రాతిలో రామాలయ వైభవం
గోకులరామం వద్ద శిల్పాలు చెక్కే పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారం క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం శిల్పులు తమ పనిలో నిమగ్నమై భారీ రాళ్లను అవసరమైన కొలతల్లోకి మారుస్తున్నారు. ఒక్కో రాతి భాగాన్ని నిపుణుల పర్యవేక్షణలో సిద్ధం చేస్తుండగా.. ఆతర్వాత స్తంభాలు, అలంకార భాగాలు, ద్వారాలు, శిల్పాలను చెక్కుతారు. సంప్రదాయ నైపుణ్యం ఉన్న శిల్పులు ఇందులో భాగం పంచుకుంటున్నారు. ఈ పనులు పూర్తయితే సంప్రదాయ శిల్పకళ, శిలామయ నిర్మాణాలు, వైష్ణవ ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా భద్రగిరి రామాలయం రూపుదిద్దుకోనుండగా.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు ప్రాచీన శిల్పకళా వైభవాన్ని ఆస్వాదించే అవకాశం కలగనుంది.
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ శ్రీవైష్ణవ సంప్రదాయం ఉట్టిపడేలా జరగాలని ప్రభుత్వం ఆదేశించించింది. పాంచరాత్రాగమ విధానానికి అనుగుణంగా ఉపాలయాలు, మండపాలు, ద్వారాలు నిర్మాణాలకు సిద్ధమయ్యారు. లక్ష్మీతాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి ఆలయాలతోపాటు ఆళ్వార్లకు సంబంధించిన ఉపాలయాలను కూడా శిలలతోనే తీర్చిదిద్దనున్నారు. భద్రాచలం రామాలయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తర ద్వారాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా శిల్పాలను రూపొందిస్తున్నారు. రాతి శిల్పాలతో ఉత్తర ద్వారానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడంపై దృష్టి సారించినట్లు అఽధికారులు చెబుతున్నారు.


