ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ రామారావు శుక్రవారం తనిఖీ చేశారు. శ్రీమంతా హాస్పిటల్, సాయిమారుతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రుల నిర్వహణ, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించడమే కాక వార్డులు, ల్యాబ్‌లు, ఫార్మసీలను పరిశీలించి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో రికార్డులు, అనుమతులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అర్హత ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రత పాటించాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బిందుశ్రీ, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ మోతియా, డాక్టర్ మూర్తి, ఉద్యోగులు రాజేందర్, రాజేష్ పాల్గొన్నారు.


