గురుకులాలకు నిధుల కళ ! | - | Sakshi
Sakshi News home page

గురుకులాలకు నిధుల కళ !

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

ప్రతిపాదనలకు తక్షణ స్పందన

మూడు బీసీ గురుకులాలకు

రూ.1.25 కోట్లు

వైరా, బోనకల్‌, సత్తుపల్లికి మంజూరు

తాగునీరు, శానిటేషన్‌, విద్యుదీకరణ పనులకు ప్రాధాన్యత

త్వరలోనే పనులు ప్రారంభం

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధి గురుకులాలకు మహర్దశ పట్టనుంది. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం గురుకులాల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లాలోని మూడు గురుకులాల్లో వసతుల అభివృద్ధి, పునరుద్ధరణ పనులకు రూ. 1.25కోట్లు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.బాలమాయాదేవి పేరిట జీఓ 118 విడుదలైంది.

మూడు గురుకులాలకు..

జిల్లాలోని మూడు గురుకులాలకు నిధులు మంజూరయ్యారు. వైరాలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలకు రూ.85 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో గురుకులంలో నూతన టాయిలెట్‌ బ్లాక్‌ నిర్మాణం చేపడుతారు. అలాగే, పరిసరాల పరిశుభ్రత కోసం 100 మీటర్ల పొడవైన డ్రెయిన్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక బోనకల్‌లోని బీసీ బాలుర గురుకుల పాఠశాలకు రూ.20 లక్షలు కేటాయించారు. భవనాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం మెరుగుదల, బాత్‌రూమ్‌లు, శానిటేషన్‌ పునరుద్ధరణ పనులతో పాటు విద్యుదీకరణ పనులు నిర్వహిస్తారు. అలాగే, సత్తుపల్లి (లంకపల్లి) పరిధిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలకు రూ. 20 లక్షల నిధులు మంజూరవగా తాగునీటి సరఫరా, బాత్‌రూమ్‌లు, శానిటేషన్‌ వ్యవస్థ మరమ్మతులు, విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే, అక్కడ మౌలిక వసతుల లేమి, తాగునీరు, శానిటేషన్‌, విద్యుదీకరణ సమస్యలతో పాటు భవనాల మరమ్మతుల ఆవశ్యకతపై అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

గురుకుల పాఠశాలల్లో చేపట్టా ల్సిన పనులపై ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు చేశారు. మూడు గురుకులాలకు మంజూరైన నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్‌.రాంబాబు,

ఆర్‌సీఓ, బీసీ గురుకులాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement