● రైలులో తరలిస్తుండగా ఖమ్మంలో ‘రెస్క్యూ ఆపరేషన్’ ● తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా స్వచ్ఛంద సంస్థకు అప్పగింత
ఖమ్మంమయూరిసెంటర్: నేపాల్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను భారత్‌కు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రక్షించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈనెల 11న నేపాల్‌కు చెందిన బాలికను ఇద్దరు మహిళలు అక్రమంగా రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని కొల్లాం వైపు తీసుకెళ్తున్నట్లు ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ వలంటరీ యాక్షన్(ఏవీఏ)’ సంస్థ నుంచి ఖమ్మంలోని ‘ఏఐడీ’ సంస్థకు సమాచారం అందింది. దీంతో వారు మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి తెలియజేయగా రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో రైలులో తనిఖీలు చేపట్టి బాలికను రక్షించారు. అలాగే, బాలికను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలపై మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
‘మైటీ నేపాల్’ సంస్థకు అప్పగింత
బాలికను రక్షించిన అనంతరం ఖమ్మం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) సూచనతో బాలల సదనంలో వసతి కల్పించారు. అనంతరం నేపాల్‌కు చెందిన ‘మైటీ నేపాల్’ స్వచ్ఛంద సంస్థ బాలిక కుటుంబ నేపథ్యంపై నివేదిక పంపించగా.. ఆమె తల్లిదండ్రులిద్దరూ అంధులు కావడంతో ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో నేపాల్ ఎంబసీ అనుమతితో ’మైటీ నేపాల్’ ప్రతినిధి సోమవారం ఖమ్మం వచ్చి సీడబ్ల్యూసీకి తగిన పత్రాలు సమర్పించగా కలెక్టర్ దివాకర టీ.ఎస్. సమక్షంలో బాలికను అప్పగించారు. అంతేకాక రూ.20 వేల తక్షణ సాయాన్ని అందజేసిన కలెక్టర్ బాలిక పునరావాసానికి ఉపయోగించాలని సూచించారు. డీడబ్ల్యూఓ ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, వివిధ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు లింగయ్య, లక్ష్మణ్, పీ.ఎస్.ఎస్.హరిప్రసాదరావు, మహేశ్వరి, నవ్య, శ్రీలక్ష్మి, కె.శ్రీనివాస్, రాజేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


