అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

ఈనెలాఖరులోగా రబీ కార్యాచరణ

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం అర్బన్‌: ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, కాల్వ ద్వారా వచ్చే నీరు, భూగర్భ జలాలు, విద్యుత్‌ సరఫరాను దృష్టిలో ఉంచుకుని రబీలో కూడా వరి సాగు తగ్గింపుపై దృష్టి సారించాలన్నారు. ఈమేరకు ఆయిల్‌పామ్‌ తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ ఈనెలాఖరులోగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాక అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, మంచుకొండ ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్ని చెరువులను నింపడమే కాక బుగ్గవాగు ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అలాగే, మున్నేటికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కావాల్సిన భూమి సేకరించాలని తెలిపారు. అంతేకాక కేబుల్‌ బ్రిడ్జి, మెడికల్‌ కళాశాల హాస్టల్‌, పరిపాలనా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించిన మంత్రి, వెలుగుమట్ల కాలనీలోని అన్ని ఇళ్లను నవంబర్‌ 21లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆతర్వాత భూగర్భ విద్యుత్‌ పనులు, రహదారుల విస్తరణ, గృహజ్యోతి లబ్ధిదారులకు దశలవారీగా సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులు, ప్రతిపాదనలను వివరించారు. ఈ సమీక్షలో సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఖాదర్‌ బాబా, యరగర్ల హన్మంతరావు, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్‌ సీఈ వాసంతి, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement