ఖమ్మంమయూరిసెంటర్: అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా విద్యారంగం అభివృద్ధి, పరిరక్షణలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృఽథ్వీ విమర్శించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొడంగల్ పర్యటనలో విద్యాభివృద్ధిలో తెలంగాణ ముందు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని, కేసీఆర్ ప్రభుత్వం మూసివేసిన 6వేల పాఠశాలలు పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని ఆరోపించారు. అంతేకాక ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం ఉపాధ్యాయులపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శశికిరణ్, యశ్వంత్, రఘు, పృథ్వీ, కార్తీక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


