ప్రమాదం ముసుగులో ఫోన్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం ముసుగులో ఫోన్‌ చోరీ

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనం పైనుంచి పడినట్లు నటించిన ఇద్దరు వ్యక్తులు.. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి నుంచి విలువైన సెల్‌ఫోన్‌ చోరీ చేసి ఉడాయించారు. ఖమ్మం కొత్త బస్టాండ్‌ సమీపంలోని సీపీఐ కార్యాలయ కాంప్లెక్స్‌ వద్ద సోమవారం బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు కింద పడ్డారు. దీంతో కాంప్లెక్స్‌లో వ్యాపారం చేస్తున్న సాంబశివరావు ముందుకొచ్చి వారిని లేపాడు. గాయాలయ్యాయా అని వాకబు చేస్తుండగా, వారిద్దరు ఆయన నుంచి రూ.1.30లక్షల విలువైన ఐ ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయారు. కాసేపటికి సాంబశివరావు వద్ద ఫోన్‌ లేకపోవడంతో షాపు ముందు ఉన్న సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా బైక్‌పై వచ్చిన యువకులు చోరీ చేసినట్లు తేలడంతో ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

వివాహం జరిగి ఆరు నెలలకే మృత్యుఒడికి..

పెనుబల్లి: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు... నూరేళ్లు కలిసుందామని ప్రమాణం చేసి భవిష్యత్‌పై కలలతో పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెట్టారు. త్వరలోనే బిడ్డ పుట్టనుందనే సంతోషంలో ఉండగానే విధి ఆ జంటను ప్రమాదంలో రూపంలో విడదీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కడారి రాకేష్‌(25) మృతి చెందాడు. ఆయన బైక్‌పై ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా తిరువూరు వెళ్తుండగా కంటైనర్‌ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన రాకేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకోగా, ఇటీవల రాకేష్‌ భార్య గర్భం దాల్చింది. ఇంతలోనే ప్రమాదం జరగగా, పెనుబల్లి ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయన మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

రఘునాథపాలెం: ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని ఈర్లపూడికి చెందిన రైతు చల్లా గోవర్దన్‌ (55) నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స ఖర్చులతో పాటు వ్యవసాయ పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై గోవర్దన్‌ కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

గంజాయి స్వాధీనం

ఖమ్మంక్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి సమీపంలో సోమవారం పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. జహీరపుర ప్రాంతానికి చెందిన గోళ్ల శరత్‌ వద్ద రూ.19వేల విలువైన 380 గ్రాముల గంజాయి లభించడంతో అరస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement