చదువుకు పేదరికం అడ్డుకావొద్దు | - | Sakshi
Sakshi News home page

చదువుకు పేదరికం అడ్డుకావొద్దు

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

కల్లూరురూరల్‌: పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఆటంకం కలగొద్దని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. స్పష్టం చేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఆర్థికంగా వెరగబడిన ముగ్గురు విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.3లక్షలకు పైగాఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు చెక్కులను సోమవారం కలెక్టర్‌ దివాకర విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి మాట్లాడారు. ఐఐటీ రూర్కీలో చదువుతున్న చింతపల్లి పాంటింగ్‌కు రూ.1.22 లక్షలు, ఐఐటీ ఇండోర్‌లో చదువుతున్న తుంపర శ్రావణికి రూ.లక్ష, అసోదు మనోహర్‌కు రూ.93వేలు అందజేయగా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మేకల వీరస్వామి, సురక్ష హాస్పిటల్‌ మేనేజర్‌ శ్రీరామ్‌ నాగేశ్వరరావు, స్ఫూర్తి ఫౌండేషన్‌ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, ఎస్‌కే.ముజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారురాలి ఫిర్యాదుతో మేసీ్త్రపై కేసు

రఘునాథపాలెం: ఇందిరమ్మ లబ్ధిదారురాలి ఫిర్యాదుతో సుతారీ మేసీ్త్రపై సోమవారం కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు. మండలంలోని ఈర్లపూడికి చెందిన కె.పావని ప్రసన్నకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, రూ.12 లక్షలతో నిర్మించేలా మేసీ్త్ర సునీల్‌కు కాంట్రాక్టు అప్పగించారు. రూ.7 లక్షల విలువైన పనులు చేశాక ఇబ్బంది పెడుతుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

చెక్‌డ్యామ్‌ పనులు పరిశీలన

నేలకొండపల్లి: మండలంలోని కట్టుకాచారంలో చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను జల వనరుల శాఖ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. నీటి ప్రవాహం అంచనా, విస్తీర్ణం, ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. జేఈ టి.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వివాదాస్పద స్థలంలో

హెచ్చరిక ఫ్లెక్సీ

రఘునాథపాలెం: మండల కేంద్రంలోని ఓ వివాదాస్పద స్థలం విషయమై ఇరువర్గాల మధ్య కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. స్థలంపై తమకే హక్కులు ఉన్నాయంటూ ఇరువర్గాలు పత్రాలతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్డీవో ఆదేశాల మేరకు కోర్టు తీర్పు వెలువడే వరకు వివాదాస్పద స్థలంలోకి ఇరువర్గాల వారు వెళ్లొద్దని సూచిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి సమాచారం ఇచ్చినట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు.

బీజేపీ జిల్లా

అధ్యక్షుడిపై కేసు

ఖమ్మంక్రైం: సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం ఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసన తెలపడమే కాక, శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు గాను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, పలువురు నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు.

తల్వార్‌తో విన్యాసాలు.. ముగ్గురిపై కేసు

ఖమ్మంక్రైం: పుట్టిన రోజు సందర్భంగా తల్వార్లతో విన్యాసాలు చేయడమే కాక వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ముగ్గురిపై కేసు నమోదైంది. ఈమేరకు ఖమ్మంకు చెందిన షేక్‌ ఖాదర్‌, సయ్యద్‌సమీర్‌, ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన షేక్‌ సమీర్‌పై సోమవారం కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు. ప్రత్యక్షంగా పట్టుబడడమే కాక సోషల్‌ మీడియాలో వీడియోల ఆధారంగా కూడా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదం

బోనకల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కలకోట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కలకోటకు చెందిన అబ్బూరి గోపి ద్విచక్ర వాహనంపై మధిర నుండి కలకోట వస్తున్నాడు. ఈక్రమాన కలకోట బ్రిడ్జి వద్ద ఓ అపరిచిత వ్యక్తి కర్రతో ఆయనపై దాడి చేయగా.. తప్పించుకునే క్రమాన వేగంగా వెళ్తూ కలకోట బస్టాండ్‌ సమీపంలో నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈమేరకు బైక్‌ లారీ కిందకు దూసుకెళ్లగా గోపి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనకు మధిరలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, కర్రతో దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆయనది ఉప్పలమడగ గ్రామమని చెబుతుండగా, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement