పంటలు బతికేదెలా?
17 మండలాల్లో లోటు వర్షపాతం
సగటున 47.6 సెం.మీ.కు
32.1 సెం.మీ.లే నమోదు
మరోవైపు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కారుమబ్బులు కమ్ముకున్నాయి, భారీ వర్షం పడడమే తరువాయి అన్నది గతంలో మాట. ఇప్పుడు ఎల్‌నినోతో పరిస్థితులు తారుమారయ్యాయి. కారుమబ్బులు పట్టి.. మేఘాలు దిక్కులుపిక్కటిల్లేలా ఉరుములు గర్జించినా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు కురిసిన దాఖలాలే లేవు. ఆకాశంలో మబ్బులు వచ్చినా కొద్ది నిమిషాల్లోనే తేలిపోతున్నాయి. దీనికి తోడు మధ్యాహ్నం వేళ వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. గత నెలలో వరుణుడు కరుణించకపోగా.. ఈ నెలలోనైనా వర్షాలు కురుస్తాయని ఆశిస్తే ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు కామేపల్లి, కల్లూరు, ఖమ్మంరూరల్ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో తీవ్ర వర్షపాత లోటు ఉండగా మిగిలిన 17 మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది.
రెండున్నర నెలల్లో 33 శాతం లోటు
నైరుతి రుతుపవన కాలం జూన్‌లో మొదలై సెప్టెంబర్‌తో ముగుస్తుంది. గత ఏడాది జూలై, ఆగస్టులో భారీ వర్షాలు పడి వాగులు, వంకల్లో వరద పారింది. కానీ ఈసారి వరదల మాటేమో కానీ భూమిపై నీరు నిలిచే స్థాయిలోనూ వర్షం కురవలేదు. జూన్ నుంచి ఈనెల 14వ తేదీ వరకు రెండున్నర నెలల్లో ఒక్కో మండలంలో సగటున 47.6 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. కానీ 32.1 సెం.మీ. వర్షపాతమే నమోదు కావడంతో లోటు ఏర్పడింది. ఇక ఈనెల సాధారణ వర్షపాతం 240 మి.మీ. గాను ఇప్పటివరకు కేవలం 93 మి.మీ. మాత్రమే నమోదు కావడం ఎల్‌నినో తీవ్రతను తెలియజేస్తోంది.
గత ఏడాది వద్దంటే వానలు
గత ఏడాది వర్షాలు వద్దంటే కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లగా.. కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో సాధారణానికి మించి వర్షాలు కురి శాయి. ఆగస్టులో ఒక్కో మండలంలో 24సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను 37.2సెం.మీ. వర్షపాతం నమోదైంది. జూలై, సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ సీజన్‌కొచ్చే సరికి జూలై, ఆగస్టులో సగటు వర్షపాతమే నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో వచ్చే రెండు నెలల్లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో కొద్దిరోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలను బతికించుకోవడం ఎలా అన్న బెంగ రైతులకు పట్టుకుంది. బోర్లు, బావుల కింద సత్తుపల్లి, వైరా, పాలేరు ప్రాంతాల్లో వరి నాట్లు వేశారు. అలాగే, మెట్ట పంటగా పత్తి, పెసర వేశారు. ఈ పంటలు దక్కి, పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రావాలంటే ఈనెల, వచ్చేనెలలో వర్షాలు కురవాలి. వర్షాలతో వాతావరణంలో తేమ శాతం పెరిగి పంటలు చేతికి వస్తాయి. కానీ ఎల్‌నినో తీవ్రతతో ఎండలు భగ్గుమంటుండడంతో పంటలపై ప్రభావం పడుతోంది. ఎండలు ఇలాగే కొనసాగితే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతుంది. నైరుతి సీజన్‌లో వర్షాలకు ఎల్‌నినో బ్రేక్ వేస్తుండడంతో మున్ముందు పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.


