ఖమ్మం సహకారనగర్: స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు గాను 1,06,28,092 కుటుంబాల్లో 3.42 కోట్ల మందికి రేషన్‌షాపుల ద్వారా నెలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కొత్త కార్డులు ఇవ్వకపోగా దొడ్డుబియ్యమే పంపిణీ చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన అర్హులకు కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, గురుకుల విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని వివరించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరుతో సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, ఏసీఎస్‌ఓ మల్లిఖార్జున్‌బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


